రూ.50 కోట్లతో ఆలయాల అభివృద్ధి ప‌నులు: మంత్రి ఎర్ర‌బెల్లి

అభివృద్ధి పనుల పరిశీలన శివరాత్రి, శ్రీరామ నవమికి పనులు పూర్తి చేపిస్తాన‌ని హామీ విధాత, వరంగల్: వరంగల్, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాలు తెలంగాణ వారసత్వ సంపదకు చిహ్నాలుగా ఉన్నాయనీ వాటి పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు చెప్పారు. పోతన పుట్టిన బమ్మెర, వాల్మీకి రచనలు చేసిన వల్మిడి, చెన్నూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వాన కొండయ్య ఆలయం, […]

  • Publish Date - January 7, 2023 / 09:13 AM IST
  • అభివృద్ధి పనుల పరిశీలన
  • శివరాత్రి, శ్రీరామ నవమికి పనులు పూర్తి చేపిస్తాన‌ని హామీ

విధాత, వరంగల్: వరంగల్, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాలు తెలంగాణ వారసత్వ సంపదకు చిహ్నాలుగా ఉన్నాయనీ వాటి పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు చెప్పారు.

పోతన పుట్టిన బమ్మెర, వాల్మీకి రచనలు చేసిన వల్మిడి, చెన్నూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వాన కొండయ్య ఆలయం, పురాతన సన్నూరు వేంకటేశ్వర స్వామి ఆలయాలకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు. శనివారం ఈ చారిత్రక ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధి పనులను జిల్లా అధికారులు, నిపుణులతో క‌లిసి పర్యవేక్షించారు.

రూ.50కోట్లతో అభివృద్ధి పనులు

అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన క్రమంలో వీటి విశిష్టతను కాపాడేందుకు నడుము కట్టాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులతో పరిరక్షణ పనులు కొనసాగిస్తున్నాం.

శివరాత్రికి పాలకుర్తి కళ్యాణ మండపం ప్రారంభిస్తాం. ఆది కవి పాల్కురికి సోమనాథుడి విగ్రహం ప్రతిష్టిస్తున్నాం. టూరిజం హరిత హోటల్ ఏర్పాటు చేస్తున్నాం. పోతన క్షేత్రంలో 22 అడుగుల పోతన విగ్రహం ఏర్పాటు చేస్తాం.

వల్మిడిలో భారీ వాల్మీకి విగ్రహం పెడుతున్నాం. చెన్నూరు త్రికూఠ ఆలయం, వానకొండయ్య లక్ష్మి నరసింహస్వామి ఆలయం, సన్నూరులోని వేంకటేశ్వర స్వామి, శివాలయం బాగు చేస్తున్నాం. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగిందని గుర్తు చేశారు.

ఆలయ పరిసరాల‌ను సుంద‌రంగా, ప‌చ్చ‌ద‌నంతో అలంక‌రిస్తామ‌న్నారు. శివరాత్రికి పాలకుర్తి, శ్రీరామనవమికి వాల్మీకి ఆలయాల్లో పండగ వాతావరణం తీసుకొస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీనిచ్చారు.

కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపోల్ దేశాయ్, ప్రొఫెసర్ పాండు రంగారావు, దేవాదాయ శాఖ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.