విధాత: గ్లోబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. విజయదశమిని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ని రీసెంట్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. రామజన్మభూమి అయిన అయోధ్యలో ఈ టీజర్‌ని విడుదల చేశారు. అయితే ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి.. ఒకటే విమర్శలు. కార్టూన్ మూవీలా ఉందని కొందరు, రావణుడి పాత్రకు మిలట్రీ కటింగ్ ఏమిటని, యానిమేషన్ సినిమానా?, హనుమంతుడు వేసుకున్న డ్రస్ దారుణమని.. ఇలా ఒకటే విమర్శలు.
కొందరైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయని.. వెంటనే సినిమాని ఆపేయాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా టీజర్ మాత్రం కనివిని ఎరుగని రీతిలో.. వ్యూస్‌ని సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే టీజర్‌పై వస్తున్న విమర్శలకు ఇప్పటికే ఓం రౌత్ వివరణ ఇచ్చాడు. ఇంకా కావాలంటే ఈ సినిమా 3D టీజర్ చూసి మాట్లాడండి అంటూ.. కాస్త ఘాటుగానే ఆయన కూడా స్పందించాడు.
ఆదిపురుష్ 3D టీజర్‌ను గురువారం.. హైదరాబాద్ AMB మాల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ప్రదర్శన అనంతరం జరిగిన సమావేశంలో టీజర్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిల్ రాజు ఫైర్ అయ్యాడు. ఈ సినిమా సెల్‌ఫోన్‌లో చూసే సినిమా కాదు.. బాహుబలి సినిమా టైమ్‌లో కూడా.. జండూబామ్ పోస్టర్స్‌తో ట్రోల్ చేశారు.. అంటూ కాస్త గట్టిగానే ట్రోలర్స్‌పై ఆయన ఫైర్ అయ్యాడు.
ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్ టీజర్ కోసం వేచి చూసిన వారిలో నేనూ ఒకడిని. టీజర్‌ని నేను కూడా ఫోన్‌లోనే చూశా. ప్రభాస్‌కి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ‘అద్భుతం’ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టా. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ ఏమిటని అడిగితే.. ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్న ఫొటోలు పెట్టి జండూబామ్ అంటూ కొందరు విమర్శించారు.
అప్పుడే ప్రభాస్‌కి చెప్పా.. సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. ఇలాంటి సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో వచ్చే సినిమాలను సెల్‌ఫోన్‌లో చూసి అంచనా వేయకూడదు. ఇప్పుడు 3Dలో ఈ టీజర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇందులోని పాత్రలపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. నేటి తరం ప్రేక్షకులకు ఏం కావాలో, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అలానే ఈ సినిమా తీశారు.
వచ్చే సంవత్సరం జనవరి 12న విడుదలయ్యే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది. ఈ మధ్య ప్రతి సినిమాకు మొదటి రోజు నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది సినిమా చూడకుండా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్లు ఈ మధ్య బాగా ఎక్కువయ్యారు. సినిమా కామన్ ప్రేక్షకుడికి నచ్చితే చాలు. అందులోనూ ఇది ప్రభాస్ సినిమా. బ్లాక్‌బస్టర్ పక్కా..’’ అని ‘ఆదిపురుష్’ టీజర్ చూసి కామెంట్స్ చేస్తున్న వారందరికీ దిల్ రాజు గట్టిగా క్లాస్ ఇచ్చాడు.