Narasing Rao |
- విజ్ఞత ఉండదాలని కేటీఆర్‌కు చురకలు
- ఆయన సలహాదారులపై ఆగ్రహం
- ఇదిగో లేఖ పూర్తిపాఠం..
విధాత : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత బీ నర్సింగరావు (Narsing Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 40 రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతుంటే ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలని కేటీఆర్‌కు చురకలు అంటించారు.
అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్రావిర్భావానికి ముందు ఆంధ్ర ఆధిపత్యం అడుగడుగునా నిండిన తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ భావజాలాన్ని కాపాడుతూ వచ్చిన అతికొద్ది మంది తెలంగాణ దర్శక నిర్మాతల్లో నర్సింగరావు ఒకరు.
జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనకు వచ్చాయి. ఆయన సినిమాలు అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నర్సింగరావు ఇంతటి ఆగ్రహానికి గురికావడం వెనుక కారణమేంటన్న చర్చ జరుగుతున్నది. ఆయన రాసిన బహిరంగ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
ఇదీ లేఖ పూర్తిపాఠం
‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు
నేను నచ్చలేదా?
ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు?
40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడిగితే.. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు..
రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు..
అంత గొప్ప హీనులు నీ సలహాదారులు. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల (అడుగుల) ఆనవాళ్ళు ఏమిటి?
ఇవన్నీ రేపు బహిరంగంగా మాట్లాడుకుందాం..
బి నర్సింగరావు.