మాకు ఉద్యోగాలు ఇప్పించు యాదాద్రి న‌ర్స‌న్న‌.. DSC 2008 అభ్య‌ర్థుల భారీ పాద‌యాత్ర‌

న‌రసింహా స్వామికి మొక్కులు - సీఎం కేసీఆర్‌కు వేడుకోలు పాద‌యాత్ర‌లో పాల్గొన్న 400 మందికి పైగా అభ్య‌ర్థులు.. హైకోర్టు తీర్పు అమ‌లు చేయాల‌ని విన్న‌పం అభ్య‌ర్థుల నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన యాదాద్రి మోకాళ్ల‌పై మెట్లు ఎక్కి వేడుకున్న‌ అభ్య‌ర్థులు విధాత: ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రం.. వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తున్నాం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో ఏ ప్ర‌భుత్వం కూడా నోటిఫికేష‌న్లు జారీ చేయ‌లేద‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చే అధికార పార్టీ నాయ‌కుల‌కు డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల […]

  • Publish Date - January 7, 2023 / 01:58 AM IST
  • న‌రసింహా స్వామికి మొక్కులు – సీఎం కేసీఆర్‌కు వేడుకోలు
  • పాద‌యాత్ర‌లో పాల్గొన్న 400 మందికి పైగా అభ్య‌ర్థులు..
  • హైకోర్టు తీర్పు అమ‌లు చేయాల‌ని విన్న‌పం
  • అభ్య‌ర్థుల నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన యాదాద్రి
  • మోకాళ్ల‌పై మెట్లు ఎక్కి వేడుకున్న‌ అభ్య‌ర్థులు

విధాత: ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రం.. వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తున్నాం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో ఏ ప్ర‌భుత్వం కూడా నోటిఫికేష‌న్లు జారీ చేయ‌లేద‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చే అధికార పార్టీ నాయ‌కుల‌కు డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల అభ్య‌ర్థ‌న వినిపించ‌డం లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న‌చందంగా త‌యారైన ప్ర‌భుత్వ ప‌రిస్థితి.. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతోంది.

గ‌త ప్ర‌భుత్వాలు చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్ద‌కుండానే కొత్త నోటిఫికేష‌న్లు ఇస్తూ.. గ‌తంలో ఉద్యోగాలు పొంది నియామ‌కాలు జ‌ర‌గ‌కుండా ఉన్న‌వారిని తీవ్ర ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. కేవలం తెలంగాణలో మాత్రమే 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఇది రికార్డ్ అని ప్ర‌క‌టించు కుంటున్న తెలంగాణ మంత్రులు.. డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు ఏం స‌మాధానం చెబుతారు. వారికి ఉద్యోగ నియామ‌కాలు ఎప్పుడు చేప‌డుతారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే త‌మ‌కు న్యాయం చేయాలంటూ డీఎస్సీ 2008 అభ్య‌ర్థులు యాదాద్రిలో శుక్ర‌వారం భారీ పాద‌ యాత్ర నిర్వ‌హించారు. నరసింహ స్వామికి మొక్కులు- సీఎం కేసీఆర్‌కు వేడుకోలు పేరుతో డీఎస్సీ-2008 బీఎడ్ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పాద‌యాత్ర చేప‌ట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అభ్యర్థులు తరలి వచ్చి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దాదాపు 400 మంది అభ్యర్థులు అమరవీరుల స్థూపం నుంచి యాదాద్రి ఆలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు 2022 సెప్టెంబర్ 27వ తేదీన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

అదేవిధంగా నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని గతంలో వరంగల్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇచ్చి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు విన్నవించారు.

13 సంవత్సరాలుగా జీవితాలు ఆగమాగం

ఈసందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చి 100 రోజులు దాటింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించలేదని వాపోయారు. దాదాపు 1100 మంది పిటిషనర్ల జీవితాలు 13 సంవత్సరాలుగా అయోమయంలో ఉన్నాయని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఏపీ అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారని.. తాము మాత్రం ఇంకా నిరుద్యోగులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అనుసరించి డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేశారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించి 1100 మంది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సంగమేశ్వర్, కోశాధికారి జయ ప్రకాష్, బాపురెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.