AI chatbot
విధాత: కృత్రిమ మేధతో (Artificial Intelligence) కొలువులు పోతున్న ఘటనలు ఉద్యోగులు, నిరుద్యోగుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా బెంగళూరు (Bengaluru) కు చెందిన దుకాణ్ అనే స్టార్టప్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో అందులో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టారు. కంపెనీ తీసుకొచ్చిన ఏఐ చాట్ బాట్ వీరు చేసే పనిని చేస్తుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అంతే కాకుండా ఈ ఏఐ చాట్ బాట్ వల్ల తమ ఖర్చు 85 శాతం తగ్గుతుందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఏఐ చాట్ బాట్ వల్ల కలిగే లాభాలను దుకాణ్ సహవ్యవస్థాపకుడు సుమిత్ షా ట్వీట్‌లో వెల్లడించారు. ‘మీరు ఏదైనా సందేహం అడిగినపుడు ఇంతకుముందు వేచి చూసే సమయం 1 నిమిషం పట్టేది. ఇప్పుడు అది 44 సెకన్లకు తగ్గింది. పరిష్కార సమయం రెండు గంటల 13 నిమిషాల నుంచి 3 నిమిషాల 12 సెకండ్లకు తగ్గింది’ అని పేర్కొన్నారు.
లే ఆఫ్స్ సమర్థనీయమే..
90 శాతం మందిని ఒక్క సారిగా ఉద్యోగం నుంచి తొలగించడంతో దుకాణ్ సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తమ నిర్ణయంపై సుమిత్ షా వివరణ ఇచ్చారు. ఉద్యోగుల్ని ఏఐతో రీప్లేస్ చేయడం తమ ఉద్దేశం కాదని.. సంస్థ నిర్వహణ మరింత సులువుగా చేయడానికి, వినియోగదారులను ఆకట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తాము తొలగించిన ఉద్యోగుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులను వారు ఇలాంటి రొటీన్ ఉద్యోగాల్లో ఉండిపోవడం అనేది మంచిది కాదని తెలిపారు. ఈ పరిస్థితిని ఆయన ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీని ఆటవస్తువుల కొట్టులో ఉద్యోగానికి పెట్టినట్టుగా అభివర్ణించారు.
కొత్త విభాగాల్లో ఉద్యోగాలు
కస్టమర్ కేర్ విభాగంలో ఉద్యోగాలు కోత వేసినప్పటికీ.. ఏఐ, ఈ కామర్స్, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకుంటున్నామని దుకాణ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇలాంటి దిగువ స్థాయి ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తున్న సంస్థ ఇదే మొదటిది కాదు చివరిది కాబోదు. ఈ ఏడాది మేలో సుమారు 80,089 మంది ఉద్యోగులను యూఎస్ స్టార్టప్‌లు తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో దుకాణ్ యజమాని చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అందరూ చేసే ఉద్యోగాలు.. రోజూ ఒకటే పని చేసే ఉద్యోగాలు ఇక ఏమాత్రం ఉండవని.. వాటిని ఏఐ చేజిక్కించుకుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చే యువత కాస్త కష్టమైన, విభిన్నమైన ఉద్యోగాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.