- భక్తి పారవశ్యంలో మునిగిన జనారణ్యం
- చిలకల గట్టు నుంచి గద్దెల వరకు ఘనస్వాగతం
- గద్దెలపై కొలువుదీరిన నలుగురు వనదేవతలు
- జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం పరిపూర్తి
- భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
వనదేవతల రాకతో జనారణ్యంగా మారిన మేడారం భక్తి ప్రపత్తుల మధ్య పులకించి పోయింది. అనిర్వచనీయమైన ఆనందంలో జనం నిలువెల్లా మునిగిపోయారు. చిలకల గట్టు నుంచి దిగివచ్చిన సమ్మక్కతల్లికి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలుకుతూ గద్దెలపైకి తోడ్కొని వచ్చారు. సాయింత్రం 6.55 గంటలకు చిలకల గట్టు నుండి సమ్మక్క తల్లి మేడారం బయలుదేరి గద్దెపైకి రాత్రి 10 గంటలసమయంలో చేరారు. దీంతో మేడారం మహజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. అంగరంగ వైభవంగా సంప్రదాయ పద్ధతిలో డోలు చప్పులు, కొమ్ము బూర మోతల మధ్య సమ్మక్కను గద్దెలపైకి తీసుకరావడంతో జాతర అత్యంత ప్రధాన ఘట్టం ఘనంగా ముగిసింది. దీంతో గద్దెల పైనున్న సమ్మక్క, సాలలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు భక్తులు తనివితీరా మొక్కులు స్వీకరిస్తున్నారు.
సంప్రదాయ పద్దతిలో పూజలు
చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆద్వర్యం లో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపాదూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివకర టి. ఎస్, జిల్లా ఎస్.పి సుధీర్ రాంనత్ కేకన్ గిరిజన సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మూడంచెల భద్రత మధ్య మేడారానికి సమ్మక్క తల్లి బయలు దేరి మేడారం గద్దెల పైకి చేరుకుంది. మేడారం మహా జాతర లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవ్వడంతో భక్తులు పులకించి పోయారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లి గద్దె పై పూజారులు ప్రతిష్టించారు.
కన్నులపండువగా సమ్మక్క ఆగమనం
చిలుకల గట్టు నుంచి గద్దెల వరకు రహదారికిరువైపులా, శ్రీ సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాలు నుండి వచ్చిన భక్తులు బారులు తీరారు. రహదారుల వెంబడి రంగవల్లులు, బలులు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ తనివితీరా తన్మయత్వంలో మునిగిపోయారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు,యువకులు అనే తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక కోసం జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి అనే నినాదాలతో చిలకల గట్టు రహదారి మారుమోగిపోయింది.
సమ్మక్క తల్లి వచ్చే దారి వెంబడి అధిక సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయారు. చెట్లు, వాహనాలు, వాటర్ ట్యాంకులు, భవనాలు ఎక్కి అమ్మవారి రాకను స్వయంగా తిలకిస్తూ ఆత్రుతతో భక్తులందరూ ఎదురు చూశారు. ఎదుర్కొల్లతో రహదారి కిక్కిరిసిపోయింది. శివసత్తుల పూనకలు,సమ్మక్క తల్లిని ఆవహించుకుని భక్తులు ఊగిపోయారు.
భారీ పోలీసు బందోబస్తు
చిలకల గట్టు నుండి గద్దెలపైకి సమ్మక్క అమ్మవారు చేరుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు వెంబడి భారీకేడ్లు నిర్మించి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆదివాసి గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, తుడుం దెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలు తదితర విభాగాల శాఖల సమన్వయంతో కలిసి అమ్మవారిని తోడుకొని వచ్చారు. ఈ అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చిలకలగట్టు రహదారికి చేరుకున్నారు. పోటీలు పడి పొర్లుదండాలు పెడుతూ మొక్కులు సమర్పించారు.
కొలువుదీరిన వనదేవతలు
సమ్మక్క -సారలమ్మ పగిడిద్దరాజులు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చేందుకు వనం నుండి వచ్చి తమ యొక్క కోరికలను నెరవేర్చాలి తల్లి అంటూ భక్తులు మొక్కలు చెల్లించుకోవడంలో నిమగ్నమయ్యారు. సమ్మక్క తల్లీ రాకతో మేడారం జాతర పరిసర ప్రాంతాలు భక్తి భావంతో పులకించిపోయాయి. ఉత్తేజపూరిత వాతావరణంలో ఉద్వేగంతో భక్తులు ఓలలాడిపోయారు.
వనదేవతల రాక సందర్భంగా వేషధారణలు
మేడారంలో గద్దెల పైకి సమ్మక్క రాక సందర్భంగా భక్తులు అపూర్వ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సంప్రదాయ వేషధారణలు, దేవతా స్వరూపాలతో జాతర ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ, డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో అమ్మవారిని స్మరిస్తూ పాల్గొనడం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల హర్షాతిరేక నినాదాలతో మేడారం ప్రాంతం భక్తి మయంగా మారింది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా యంత్రాంగం తెలియజేసింది. భక్తులు సహకరించి శాంతి యుతంగా దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పుట్ట తేనంత చక్కని తీర్థం! ఆత్మగౌరవ ప్రతీక.. మేడారం అమ్మల జాతర
Sammakka Thalli Arrival | వనం నుంచి జనంలోకి సమ్మక్క తల్లి
Medaram Maha Jatara|| పారవశ్యంలో మునిగిన మేడారం
***
