- చిలుకల గుట్ట నుంచి సమ్మక్క ఆగమనం
- గాల్లోకి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కాల్పులు
- చిలుకల గుట్ట నుంచి గద్దెల వరకు జనహోరు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Sammakka Thalli Arrival | ప్రపంచ ప్రఖ్యాత మేడారం గిరిజన జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా భక్తుల జయజయద్వానాల మధ్య మొదలైంది. జై సమ్మక్క జనహోరు నడుమ జనం కోలాహాలం, ఎదురుకోళ్ళు, కొబ్బరికాయలు, కోడిపిల్లలు సమర్పిస్తూ కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దెలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. సమ్మక్క వడ్డెలు చిలుకల గుట్ట నుంచి కిందకు వనదేవతను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య కిందకు తీసుకొచ్చారు. చిలుకల గుట్ట నుంచి పూజారులు కుంకుమ భరిణెతోసహా కిందికి తీసుకువస్తుండగా కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుగా సమ్మక్క రాకకు సూచికగా ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. గుట్ట నుంచి కిందికి దిగిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద మరో రెండు సార్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక న్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ లు, జిల్లా కలెక్టర్, డి ఎఫ్ ఓ , ఇతర సిబ్బంది పెద్ద కేరింతలు నడుమ అక్కడ ప్రత్యేక సందడి వాతావరణం నెలకొంది.
సమ్మక్క రాక సందర్భంగా భారీ రోప్ పార్టీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. భక్తిపారవశ్యంలో నిమగ్నమైన వడ్డెలు ఎర్రవస్ర్తం తలకు చుట్టుఉని ఉద్విగ్న, ఉత్తేజకరమైన వాతావరణంలో ముందుకు సాగుతుండగా వారికి పోలీసులు తగిన భద్రత కల్పించారు. సమ్మక్క వస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలిచి మొక్కులు సమర్పించుకున్నారు. కొందరు వరాలు పట్టారు. రోడ్డు పై పడుకున్న వారిపై నుంచి సమ్మక్క పూజారులు నడుస్తుండగా జనహోరు వనమంతా మారుమోగుతూ హోరెత్తింది. పూనకాలతో శివసత్తులు ఊగిపోతుండగా జనం జేజేలు పలుకారు. వనం నుంచివచ్చే సమ్మక్క తల్లి రాక కోసం జనం ఎదురుచూస్తూ క్యూలైన్లో నిలుచున్నారు.
