విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు రెండేళ్ల తర్వాత ఇప్పుడే సిట్ విచారణ నోటీసులు ఎందుకు ఇచ్చింది అన్న ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2024మార్చి 10న నమోదైన కేసులో రెండేళ్ల పాటు సాగుతున్న విచారణ తుది దశకు చేరుకున్న క్రమంలో అప్పటి ప్రభుత్వ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విచారణ ప్రక్రియలో భాగంగానే నోటీసులు..విచారణ తప్ప..ఎంతమాత్రం రాజకీయ కక్ష చర్యకాదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే నోటీసులు
అయితే ఇప్పుడే.. అది కూడా శుక్రవారం రోజున విచారణకు సిట్ ఎందుకు సిద్దపడిందన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో వరుసగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ లకు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించి విచారణ డ్రామా చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
ముఖ్యంగా శుక్రవారం రోజున ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి కిలకమైన ఢిల్లీలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం జరుగనుందని, ఈ నేపథ్యంలోనే జల పోరాటం చేస్తున్న కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబు సంతోషం కోసం రేపు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలుపబోతుందని ఈ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసీఆర్ ను ఇప్పుడు విచారణకు పిలిచారని గులాబీ పార్టీ భగ్గుమంటుంది.
ఇదే అంశాన్ని ఆసరగా చేసుకుని సెంటిమెంట్ రాజకీయాలతో కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలకు కౌంటర్ వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుండటం ఆసక్తికరం.
