Site icon vidhaatha

ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్‌ చేస్తుందని వార్తలు..! దర్యాప్తు సంస్థ ఏమన్నదంటే..?

Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో దాడులు జరిగాయన్న ఆప్‌ చేస్తున్న ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ నివాసంలో సోదాలు నిర్వహించే ఆలోచన ఏదీ లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 3న విచారణకు రావాలని ఈడీ గతంలో జారీ చేసిన నోటీసుల్లో కోరింది. అయితే, విచారణకు అరవింద్‌ కేజ్రీవాల్‌ గైర్హాజరయ్యారు. ఈడీకి లేఖ రాయగా.. దాన్ని పరిశీలిస్తున్న ఈడీ.. ఢిల్లీ సీఎంకు నాల్గోసారి సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత ఇంట్లో గురువారం దాడులు జరిపి అరెస్టు చేయనుందని తమకు సమాచారం అందిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ పేర్కొంది. మద్యం పాలసీ స్కామ్‌లో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేయగా.. ఆయన బుధవారం విచారణకు హాజరుకాలేదు. రాజ్యసభ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవ సన్నాహాల నేపథ్యంలో విచారణకు రాలేనని.. విచారణకు సంబంధించిన ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు రాసి పంపిస్తానని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఏ ప్రశ్నలు పంపినా.. సమాధానం ఇచ్చేందుకు సంతోషిస్తానన్న ఆయన.. తనకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయంలో ఈడీ మితిమీరిన గోప్యత పాటిస్తుందని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


అయితే, ఢిల్లీ సీఎంను అరెస్టు చేయాలని ఈడీ ఉద్దేశమని.. ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించాలని చూస్తుందని ఆప్‌ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని.. అవినీతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. కేజ్రీవాల్‌కు మూడోసారి ఈడీ సమన్లు పంపిన నుంచి ఆయనను అరెస్టు చేస్తారని ఆప్‌ పేర్కొంటున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే రాజీనామా చేయాలా ? లేక జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించాలా ? అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు పార్టీ నేతలు ‘మై భీ కేజ్రీవాల్’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు.


అయితే, ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ ఇప్పటికే జైలులో ఉన్నారు. మరో వైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆప్‌ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం వెలుపల భద్రతను పెంచారు. ఆప్‌ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్‌ భరద్వాస్‌, ఎంపీ సందీప్‌ పాఠక్‌ గురువారం సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని, ఈ మేరకు తమకు సమాచారం అందిందని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

Exit mobile version