18న ఏడుపాయ‌ల జాత‌ర‌.. ఏర్పాట్ల‌పై MLA స‌మీక్ష

భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ విధాత‌, మెద‌క్ బ్యూరో: జిల్లాకే ప్ర‌తిష్టాత్మ‌కం ఏడుపాయ‌ల జాత‌ర అని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వ దిన సందర్భంగా ఈ నెల 18 నుండి మూడ్రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఏడుపాయల […]

  • Publish Date - February 2, 2023 / 01:57 PM IST
  • భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
  • జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ

విధాత‌, మెద‌క్ బ్యూరో: జిల్లాకే ప్ర‌తిష్టాత్మ‌కం ఏడుపాయ‌ల జాత‌ర అని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వ దిన సందర్భంగా ఈ నెల 18 నుండి మూడ్రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఏడుపాయల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులందరూ సమ‌ష్టితో పనిచేయాలని సూచించారు.

8 సంవత్సరాల నుండి విజయవంతంగా జాతరను నిర్వహిస్తున్నామని, 9వ సారి జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. జాత‌ర‌కు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి 8 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశముందని అన్నారు.

రహదారుల పై జాతరకు సంబంధించి హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నాగసానిపల్లి, పోతంశెట్టిపల్లి ఇరు ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశమున్నందున చక్కటి లైటింగ్, పార్కింగ్, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్‌ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధిక సంఖ్యలో టాయిలెట్స్, బట్టలు మార్చుకొనుటకు గదులు ఏర్పాటు చేయాలని సూచించారు.

భక్తులు స్నానమాచరించుటకు విరివిగా షవర్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. దుమ్ము, దూళీ లేవకుండా ప్రతి రోజు రోడ్లపై నీళ్లు చల్లాలని, విద్యుత్ లో అంతరాయం లేకుండా చూడాలని, నీటి ప్రవాహ‌ ప్రాంతంలో, స్నానమాచరించే ప్రాంతంలో, బ్రిడ్జిల వద్ద గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాల‌ని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండు నుంచి దేవస్థానం వరకు ఉచితంగా మినీ బస్సులు, పోలీస్‌ ఆధ్వర్యంలో 10 ఆటోలు నడపాలని సూచించారు. బందోబస్తు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల‌న్నారు. అనంత‌రం జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అధికారులు స‌మిష్టిగా ప‌నిచేయాలి: క‌లెక్ట‌ర్ రాజార్షిషా

భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమ‌ష్టి గా పనిచేస్తూ రెండు రోజుల ముందుగా అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గత జాతరలో శానిటేషన్ బాగా చేశారని ఈ సారి కూడా లేబర్ ను ఎక్కువ పెట్టుకొని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జాతర లోపల, బయట ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

17 నుంచే పోలీస్ బందోబస్తు: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

ఈ నెల 17 నుంచే పోలీస్ బందోబస్తులో ఉండాలని, సి.సి. కెమెరాలు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి పర్యవేక్షించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గజ ఈతగాళ్ళు లైఫ్ జాకెట్లతో భక్తులు స్నానమాచరించే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

జాతర సందర్భంగా ఏర్పాటు చేసే జాయింట్ వీల్స్, రంగుల రాట్నం పటిష్టత తెలుసుకోవాల‌న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈ .ఓ. శ్రీనివాస్, ఆర్డీఓ సాయి రామ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.