Edupayala Jathara | తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల ఏదో ఒక ఆలయంలో జాతరలు కొనసాగుతూనే ఉంటాయి. మొన్నటి వరకు మేడారం జాతర( Medaram Jathara ) కొనసాగింది. ఇప్పుడు ఆ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా అభివర్ణించే ఏడుపాయల దుర్గా భవాని జాతర( Edupayala Vanadurga Bhavani Jathara ) మహా శివరాత్రి( Maha Shivaratri ) సందర్భంగా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. 17వ తేదీ వరకు ఘనంగా కొనసాగనుంది. మరి ఈ ఏడు పాయల దుర్గా భవాని జాతర నేపథ్యం, విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏడుపాయల క్షేత్రం విశిష్టత..!
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద ఏడుపాయల దుర్గా భవాని ఆలయం ఉంది. ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలిపోతోంది. ఈ పాయల మధ్య వన దుర్గమ్మ ఆలయం వెలిసింది. అమ్మవారి గుడి దాటినా తర్వాత మళ్లీ కలిసి అమ్మవారి పాదాల చెంత నుంచి నది ప్రవహిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ఆలయ పురాణ ప్రాశస్త్యం
ఏడుపాయలు క్షేత్రానికి మహాభారత కాలం నాటి పురాణ గాథలతో ముడిపడిన చారిత్రక నేపథ్యం ఉంది. వ్యాస మహాభారతం ప్రకారం పాండవుల వనవాస కాలంలో అర్జునుడు కౌరవ సేనపై విజయం సాధించడానికి దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
ఏం కోరినా తప్పకుండా నెరవేరుతుంది..!
వన దుర్గామాత అమ్మవారిని భక్తిశ్రద్ధలతో మనసారా ఏం కోరినా కూడా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దివ్యశక్తికి సంకేతంగా ఉన్న అమ్మవారు.. తనను నమ్మిన భక్తులకు శ్రేయస్సు, సుఖసంతోషాలను అందిస్తుంది. భక్తుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది.
మూడు రోజుల పాటు జాతర ఇలా..
ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జాతర కొనసాగనుంది. తొలిరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక రెండో రోజు 16న బండ్ల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ బండ్ల ఉత్సవానికి ఏడుపాయల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువస్తారు. వాటిని ఆలయ చుట్టూ ప్రదర్శనగా తిప్పుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజున 17న రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగియనుంది.
