Shani Devudu | హిందూ మతంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు అనుగ్రహం కలిగి ఉంటే.. శని దోషం తగ్గిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు. ఆయన కటాక్షం ఉంటే జీవితం స్థిరంగా, శ్రేయస్సుతో ముందుకు సాగుతుందని భక్తుల నమ్మకం. కొంతమంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. అలాంటి వారు శని దేవుడి అనుగ్రహం పొందాలంటే.. శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిది. మరి ఆ ఆచరణలు ఏవో తెలుసుకుందాం.
నెయ్యితో దీపం వెలిగించాలి..
శనివారం రోజున పొద్దున్నే స్నానమాచరించి.. శని దేవుడి ఆలయానికి వెళ్లాలి. అక్కడ నెయ్యితో దీపం వెలిగించి.. నల్ల నువ్వులు సమర్పిస్తే శుభాలు కలుగుతాయట. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం.
కాకులకు అన్నం, పప్పు సమర్పణ..
శనివారం రోజున పూజల అనంతరం.. కాకులకు అన్నం, పప్పు సమర్పించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట. ఆహారం, వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి వంటి వస్తువులను అవసరమైన వారికి అందించడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
శివుడు, హనుమంతుడు ఆరాధన
శని ప్రభావం తగ్గాలంటే శివుడు, హనుమంతుడు ఆరాధన చేయడం మంచిదని పండితులు సూచిస్తారు. శివలింగానికి బిల్వపత్రాలతో అర్చన చేసి, ఆవుపాలను సమర్పించడం శుభప్రదం. శనివారం రోజున హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత కలిగి, శని ప్రభావం శాంతిస్తుందని విశ్వాసం. .
