Site icon vidhaatha

గుజరాత్‌: ఎన్నికల నిర్వహణ బాధ్యత యువతకు

విధాత: గుజరాత్‌లో ఓటింగ్‌ శాతం పెంచటం కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 33 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను యువతకే అప్పజెప్పింది. ఈ విధమైన చర్యల ద్వారానైనా యువతను ఓట్లు వేయటానికి ఆకర్షించవచ్చని భావిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓట్లు వేసే రోజును ‘ప్రజాస్వామ్య పండుగ దినం’ అని చెప్పుకొచ్చారు. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా సాధారణ ప్రజల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం పట్ల నిరాసక్తత వ్యక్తమవుతున్నది. ఓటు వేయటం ద్వారా తమకు ఏం ఒనగూడుతున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశంలో మూలమూలనా ఎన్నికల పట్ల ప్రజలు ఆసక్తి కనబర్చటం లేదు. ప్రజలను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రప్పించేందుకు పార్టీలు మొదలు ప్రభుత్వ యంత్రాంగం దాకా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికల కమిషన్‌ ఈ సరికొత్త కార్యాచరణ ద్వారానైనా ఓటింగ్‌ శాతం పెరుగుతుందని భావిస్తున్నది.

Exit mobile version