Site icon vidhaatha

మళ్లీ ఆరు నెలల్లో ఎన్నికలు తప్పవు.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

విధాత: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలనే మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు తప్పవు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలిలోని తన ఛాంబర్‌లో మీడియా మిత్రులతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

తమ ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాజగోపాల్ రెడ్డిని వాడుకొంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌,బీజేపీల మధ్య పోటీ ఉంటుందని చెప్పుకునేందుకు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందన్నారు.

మునుగోడులో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదు. అందుకనే ఇతర పార్టీల నేతలను ప్రలోభాలు పెట్టే యత్నం బీజేపీ చేస్తోందని నిప్పులు చెరిగారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కనీసం ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బీజేపీ నేత కావడంతోనే బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే అధికార పార్టీని గెలిపిస్తాయన్నారు.

భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ప్రధాని అయ్యేందుకు ఏ పార్టీనైనా కలుపుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయన నాయకత్వం ఈ దేశానికి అవసరమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే 6 నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని గుత్తా చేసిన వ్యాఖ్యలు ఈరోజు అంతటా వైరల్‌గా మారాయి. ఈ సారి ఎన్నికలు అందరూ ఉహిస్తున్నట్టుగా ముందుగానే వస్తాయనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని అంతా చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరిలో అసెంబ్లీని డిస్వాల్‌ చేసి ముందస్తుకు పోతారు అనడానికి ఇది సంకేతమని అనుకుంటున్నారు.

Exit mobile version