హైదరాబాద్: హైదరాబాద్‌లో చారిత్రక జాతీయ నుమాయిస్‌కు అంతా సిద్ధమైంది. ఎగ్జిబిషన్ సొసైటీ 83వ నుమాయిష్ వచ్చేవారం ప్రారంభం కానున్నది. దీనిని 46 రోజులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వస్తువులను ఇక్కడ విక్రయానికి పెడతారు. ఓపెన్-ఎయిర్ శీతాకాలపు షాపింగ్ ఫెస్టివల్ నుమాయిష్ జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్నది. ఈ జాతీయ వాణిజ్య ఎగ్జిబిషన్‌కు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.
కేవలం షాపింగ్‌కే పరిమితం కాకుండా వాణిజ్యం, వ్యాపారాన్ని వినోదం, విశ్రాంతితో కూడిన ఈ ప్రదర్శన ఏటా లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తున్నది. ప్రదర్శన సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు ఓపెన్‌గా ఉంటుంది. గతేడాది టికెట్ ధరలను రూ.10 పెంచినప్పటికీ, ఈ ఏడాది మాత్రం అవి మారకుండా రూ.40గానే నిర్ణయించారు.
హైదరాబాద్‌లోని నుమాయిష్ చరిత్ర
Numaish-e-Masnuaat-e-Mulki, లేదా సంక్షిప్తంగా Numaish అంటారు. 1938లో స్థానికంగా ఉత్పత్తి అయన వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమంగా ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ల బృందం చేసిన ఆలోచన. హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తొలి ‘నుమాయిష్’ను ప్రారంభించారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో దీన్ని వార్షిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. వచ్చే ఆదాయాన్ని విద్యాభివృద్ధికి ఖర్చుచేస్తున్నారు.