- ప్రదర్శనకు సబ్ మెషిన్ గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ మోడల్స్
- అంతర్గత భద్రతపై ఢిల్లీలో ముగిసిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్
హైదరాబాద్: ఢిల్లీ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌లో తయారు కానున్న ఆయుధాల ప్రదర్శన అబ్బుర పరిచింది. సందర్శకులను ఆకట్టుకుంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ మిలిపోల్ ఇండియా-2023 నిర్వహించారు. ఇందులో ఐకామ్- కారకాల్ సంస్థలు హైదరాబాద్‌లో తయారు కానున్న సబ్ మెషిన్ గన్స్, కాంబాక్ట్ పిస్టల్స్, స్నిపర్, అసాల్ట్ రైఫిల్స్‌ను ప్రదర్శించాయి. ఆయుధ నమూనాలు రక్షణ రంగంలోని సంస్థలు, నైపుణ్యం ఉన్న ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా పథకాల్లో భాగంగా అత్యాధునికమైన ఈ ఆయుధాలను తయారు చేయడానికి ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్, ఎంఈఐఎల్ గ్రూప్ సంస్థ ఐకామ్ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో ఆయుధాలు తయారు చేయడానికి సిద్దమయ్యాయి. ఈ సందర్భంగా కారకాల్ సీఈఓ హమద్ అల్ అమేరి మాట్లాడుతూ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మిలిపోల్ ఇండియా 2023 ఎంతో ఉపయోగ పడిందని తెలిపారు. తమ ఉత్పత్తులు అంతర్గత భద్రతకు, రక్షణ సంస్థలకు బాగా ఉపయోగ పడతాయన్నారు. ఐకామ్ ఎండీ సుమంత్ పాటూరు మాట్లాడుతూ ఆయుధ రంగంలో అత్యాధునిక సాంకేతికను జోడించడమే తమ ఉద్దేశమన్నారు.