Site icon vidhaatha

IND vs PAK | దాయాది పాకిస్తాన్‌తో క్రికెట్‌.. టికెట్ ధ‌ర 57 ల‌క్ష‌లు!

IND vs PAK |

విధాత‌: దాయాదితో పోరు అంటే మామూలుగా ఉండ‌దు. భార‌త్‌-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ లవ‌ర్స్‌కు పండుగే పండుగ‌. ఆ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రియులు ఎన్ని డ‌బ్బులైనా పెడ‌తారు. అదే వ‌ర‌ల్డ్‌క‌ప్ క్రికెట్‌లో దాయాది దేశాలు త‌ల‌ప‌డితే అంద‌రి కండ్లు ఆ మ్యాచ్‌పైనే ఉంటాయి. ఆ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి.

వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనున్న‌ది. చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరగనున్న‌ది. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న‌ది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు.

వయాగోగో వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్ట‌గా.. క్షణాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. కొన్ని టికెట్లు సదరు సంస్థ రూ. 19.5 లక్షలకు.. మరికొన్ని టికెట్లను రూ. 57 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తున్న‌ది. ప్రస్తుతం దీనిపై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న‌ది. టికెట్ ధర లక్షల ప‌లుకుతుండ‌టంతో.. సదరు సంస్థపై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

టికెట్ల పేరుతో పట్టపగలే నిలువు దోపిడికి పాల్పడుతున్నారని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఓ టికెట్‌ను రూ. 15 లక్షలకు అమ్ముతున్నట్లు వయోగోగో వెబ్‌సైట్‌లో చూశానని మరో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టికెట్ల ధరలను చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుందని మరొక‌రు చెప్పారు. భార‌త్‌-పాక్ మ్యాచ్ రేట్ల వ్య‌వ‌హారం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Exit mobile version