Site icon vidhaatha

ఫిల్మ్ జర్నలిజంలో సరికొత్త సంచలనం.. ఫిలిం కాంపానియ‌న్‌!

విధాత‌: ఫిల్మ్ జర్నలిజం అంటే చాలా మందికి చిన్న చూపు.. దానికి ఓ కారణం కూడా ఉంది. సినీ ప్ర‌ముఖుల‌కు కూడా చిన్న చూపే. ఎందుకంటే తమ మీద ఆధారపడి బతుకుతూ లాభాలు గడిస్తూ తమ ప్రకటనలను వేసుకుంటూ బతికే మీరు మమ్మల్ని విమర్శిస్తారా అనే పాయింట్ వాళ్లు లేవనెత్తుతారు. కాకపోతే సోషల్ మీడియా వలన ఆ భావన క్రమంగా తొలగుతోంది. దాన్ని నిలబెట్టుకుందాం.

స్వతంత్ర పాత్రికేయానికి శ్రీకారం చుడదాం. చాలా కాలం ముందు తెలుగు ఫిల్మ్‌ జర్నలిజం అంటే ఏదో మూడు నాలుగు ప్రింటింగ్ పత్రికలది. సితార, జ్యోతి చిత్ర, శివరంజని, మేఘసందేశం ఇలా ఉండేవి. దానికి అదనంగా డైలీ పేపర్లు ఉండేవి అంటే.. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, ప్రజాశక్తి , ఉద‌యం, ఇప్పుడు సాక్షి, సూర్య, నమస్తే తెలంగాణ ఇలా అన్నమాట. వారు మహా అయితే ఒక రోజు మొత్తం న్యూస్‌కి ఒక అర పేజీ మాత్రమే కేటాయిస్తారు.

డిమాండ్ ఉన్నచోటే సప్లై కూడా ఉంటుంది. ఈ సూత్రం ప్రకారం దినపత్రికలు పక్క రోజే వస్తాయి. అందరూ చదువుతారు. అందునా డైలీ పత్రికలు అంటే అందరూ చూసే పత్రికలు అని మన సినిమా వాళ్ల‌ అభిప్రాయం. కాబట్టే వాటికి పెద్ద పీట వేసేవారు. ఇక సినీవారపత్రికలను తీసి పక్కన పెడతారు.

వారానికి వచ్చే ఆ పత్రికలతో వాళ్ల‌కి ఏమీ పని లేదు, అవి చ‌ద్దివార్త‌లు అనే భావ‌నలో ఉండేవారు. అందుకే ఇంటర్వ్యూలు అడిగితే నాన్చుతారు. వాళ్లని పొగడ‌డానికి, వాళ్లని భజన చేయడానికి ఈ పత్రికలు ఉన్నాయని భావన వారిది, సినీ మేధావులు కూడా ఇది భ‌జ‌న కాదు బాధ్య‌త అనేవారు. అందునా సినీ పత్రికలలో పూర్తిగా సినిమా సమాచారం ఉంటుంది. సో సినీ ప్రియులు మాత్ర‌మే చదువుతారు. సో బయటి వ్యాపార ప్రకటనలు రావు. కాబట్టి సినిమా వారు ఇచ్చే ప్రకటనలపైనే ఆధారపడతారు.

కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చింది. దాదాపు సినీ వారపత్రికలన్నీ మూతపడ్డాయి. ఏదో దినపత్రికలు నడుస్తున్నాయి. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని వెబ్‌సైట్స్, యూట్యూబ్స్ బాగా పుంజుకున్నాయి. వీళ్ల‌లో భజన పరులు, అవినీతిపరులు లేరా అంటే ఉంటారు. కానీ అందరూ చెత్తగా ఉంది అన్న సినిమాను ఒకడు పని కట్టుకొని చాలా బాగుంది అంటే ఆ వెబ్ సైట్‌కు లేదా యూట్యూబ్ కు ఉండే గుడ్ విల్ పోతుంది. అందుకే భయపడతారు. దీని ద్వారా నిక్కచ్చిగా వార్తలు, విశ్లేషణలు, రివ్యూలు రాసే అవకాశం ఉంటుంది.

ఇక నాడు సినీ పత్రికలకు, డైలీ పత్రికలకు ఒక్కొక్క‌రిని ఒక్కో రోజు విడిగా ఇంటర్వ్యూకి పిలిచి ఇచ్చేవారు. ఆ తర్వాత వారపత్రికల‌ వంతు. మొదట్లో ఒక్కో పత్రికకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. దాంతో ఎవరి ప్రశ్నలు వాళ్ళు సంధించేవారు. ఆ తర్వాత అందరినీ క‌లిపి ఒకేసారి గుంపులో గోవిందా అన్నట్టు ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. తప్పదు.. వాళ్లు చెప్పినట్టే జరిగింది. కానీ కొందరు క్రేజ్ త‌గ్గిన సెలబ్రిటీలు, కొత్తగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారు చానెల్స్ స్టూడియోలోకి వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు.

కానీ మెయిన్ స్ట్రీమ్ సెల‌బ్రిటీలు మాత్రం తమ దగ్గరికి మీడియా రావాలని అనేవారు. ఏదో యాంకర్‌తో నలుగురు ఐదుగురు యూనిట్ సభ్యులు కూర్చుని వారి ప్రశ్నలకు వారే సమాధానం చెప్పుకోవడం మొదలుపెట్టారు. దాన్ని చానల్‌కు పంపించేవారు. దాంతో తెలుగు ఫిలిం రోజురోజుకు తీసి కట్టుగా మారింది.

కానీ బాలీవుడ్ కోలీవుడ్‌లో అలా కాదు. ఇప్పుడు ఆ వంతు టాలీవుడ్‌కు కూడా వచ్చింది. స్వతంత్ర ఫిలిం జర్నలిజం చేసే అవకాశం లభించింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని విప్ల‌వాత్మ‌క ప‌రిణామాలు ఖాయం. దానిలో భాగంగా తొలి అడుగు ప‌డింది. ఫిల్మ్ కంపానియ‌న్ అనే సంస్థ ఆయా సంవత్సరాల్లో ప్రేక్షకుల మన్న‌న‌లను పొందిన సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులతో రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఒక రౌండ్ టేబుల్ చిట్ చాట్ నిర్వహిస్తుంది.

దీనికి టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన వారిని ఈ సంస్థ ఆహ్వానిస్తుంది. అలా ఈ ఏడాది చెన్నై వేదికగా నిర్వహించిన ఫిలిం మేకర్స్ అడ్డా విభాగంలో అగ్ర దర్శకుడు రాజమౌళి, గౌతమ్ వాసుదేవ మీనన్, లోకేష్ కనకరాజ్, పృథ్వి సుకుమారన్, కమల్ హాసన్, స్వప్నదత్ వంటి వారు హాజరయ్యారు. యాక్టర్ అడ్డా‌లో విద్యాబాలన్ ,అనిల్ కపూర్, దుల్కర్ సల్మాన్, రిష‌బ్ శెట్టి, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, షీబా చ‌ద్దా, వరుణ్ ధావన్, విజయ్ వర్మ, జాన్వి కపూర్‌ మెరిశారు. వీరిలో కొందరు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

వివిధ పరిశ్రమలకు చెందిన వారిని ఒకే చోట చేర్చడంపై సినీ ప్రియులలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇది నూత‌న ప‌రిణామం. స‌రికొత్త ఫిల్మ్ జ‌ర్న‌లిజానికి నాంది. ఇది ఆయా సినీ వ్యక్తులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే పరిణామం అనే చెప్పాలి. నేను ఎంతగానో అభిమానించే నటులను కలిసే అవకాశం దక్కింది. దీనిని గౌరవంగా భావిస్తున్నా అని జాన్వి కపూర్ తెలిపింది. అద్భుతమైన నటులతో అత్యద్భుతమైన చర్చ అని రిషబ్ శెట్టి క్యాప్షన్ ఇచ్చాడు.

ఇంతమంది డార్లింగ్స్‌ తో ముచ్చటించేందుకు డార్లింగ్స్ సినిమా నాకు అవకాశం కల్పించింది అని విజయ్ వర్మ పేర్కొన్నాడు. ఈ రౌండ్ టేబుల్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని షేద్దా తెలిపింది. RRRతో రాజమౌళి, విక్రమ్‌తో లోకేష్ కనకరాజు, విందు ధనింద్రుడు కాదు చిత్రంతో గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ఈ అవకాశం సంపాదించగా, విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ న‌టించ‌డమే కాదు ఆయ‌న నిర్మాత‌గా కూడా వ్యవహరించారు. ఆ కేటగిరీలో ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది.

సీతారామం చిత్రం తరఫున నిర్మాత స్వప్నద‌త్, డైరెక్టర్ గా బ్రో డాడీ, ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలను ముందుకు తీసుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్, కాంతారాతో రిషబ్ శెట్టి, సీతారామంతో దుల్కర్‌ ఈ అవకాశాన్ని అందుకున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారు తమకు ఆ సినిమాల ఆలోచన ఎలా వచ్చింది? వాటిని తెరకెక్కించే క్రమంలో ఎదురైన సమస్యలేంటి తదితర అంశాలను చర్చించడం జరుగుతుందని విడుదలైన వీడియోలను చూస్తుంటే తెలుస్తుంది.

Exit mobile version