Site icon vidhaatha

Food inflation | ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 11.5 శాతం

Food inflation | విధాత‌: ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 2020 అక్టోబ‌రు త‌ర్వాత రికార్డు స్థాయిలో 11.51 శాతానికి ఎగ‌బాకింది. జూన్‌లో 4.55 శాతంగా ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం జూలైలో 11.5 శాతానికి పెరిగింది. వినిమ‌య ధ‌ర‌ల సూచీ(సీపీఐ)లో స‌గం ప‌రిమాణం ఉండే ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో వినియోగ‌దారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వినిమ‌య ధ‌ర‌ల సూచీ భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు ఊహించిన ప‌రిమితికి మించి 7.44 శాతానికి పెరిగింది.

గ‌త ప‌దిహేను మాసాల్లో ఇదే అత్య‌ధికం. కూర‌గాయ‌లు, దినుసులు, తృణ ధాన్యాల ధ‌ర‌లు విప‌రీతంగా పెరగ‌డంతో వినిమ‌య ధ‌ర‌ల సూచీ పైకి ఎగ‌బాకిన‌ట్టు భావిస్తున్నారు. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు సీపీఐ 6.4 శాతానికి పెరుగ‌వ‌చ్చున‌ని అంచ‌నా వేసింది. సీపీఐ ప‌దిహేను మాసాల గ‌రిష్ఠ స్థాయి 7.44 శాతానికి పెరిగింద‌ని ఐసీఆర్ ఏ ప్ర‌ధాన ఆర్థికవేత్త అదితీ నాయ‌ర్ వెల్ల‌డించారు. ఆగ‌స్టులో కూడా ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోకి రాలేద‌ని, దీంతో సీపీఐ 6.5 శాతానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నాయ‌ర్ తెలిపారు.

సెప్టెంబ‌రులో ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి రావ‌చ్చున‌ని అదితీ నాయ‌ర్ చెప్పారు. కూర‌గాయ‌ల ధ‌ర‌లు గ‌త ఏడాది జూలైతో పోలిస్తే 37.3 శాతం అధికంగా ఉన్నాయ‌ని, దినుసుల ధ‌ర‌లు 21.6 శాతం పెరిగాయ‌ని, తృణ ధాన్యాల ధ‌ర‌లు 13 శాతం, ప‌ప్పుల ధ‌ర‌లు 13.5 శాతం పెరిగాయ‌ని జాతీయ స్టాటిస్టిక‌ల్ ఆఫీసు వెల్ల‌డించింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం ప‌ట్ట‌ణాల‌కంటే గ్రామీణ ప్రాంతాల‌లోనే ఎక్కువ‌గా ఉంద‌ని ఎన్ఎస్ఓ తెలిపింది.

Exit mobile version