ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాకే
ఏఐ టెక్నాలాజీతో క్రియేషన్
ఎవరెవర్ని కలిశాడో చూశారా
విధాత : బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే అందరికి సుపరిచితమే. పాలమ్మినా..పూలమ్మినా..రియల్ ఎస్టేట్ చేసినా..మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా..జీవితంలో అన్ని సాధించినా అంటూ ఆయన చెప్పే డైలాగ్ లు అందరిని నవ్విస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులపై తొడలు కొట్టి కవ్వించినా..అసెంబ్లీలో నవ్వులు పూయించినా ఆయనకే చెల్లు. విద్యార్థుల ఫంక్షన్ లతో పాటు సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్లి తన మాటలతోనే కాదు..డ్యాన్స్ లతోనూ వైరల్ గా మారిపోతుంటాడు. అట్లాంటి మల్లారెడ్డి ఎందుకో గాని ఆధిత్య 369లో హీరో బాలకృష్ణ మాదిరిగా ఆకస్మాత్తుగా టైమ్ మిషన్ లో కి వెళ్లిపోయాడు. ఎందుకో తెలిస్తే..అక్కడ ఎవరెవరిని కలిశాడో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అంటున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఏఐ టెక్నాలాజీతో..టైమ్ మిషన్ కాన్సెప్టు తో మల్లారెడ్డి తన విద్యాసంస్ధల ప్రమోషన్ కు తానే హీరోగా మారిపోయి రూపొందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విద్యాసంస్థల ప్రమోషన్ల యాడ్ ను మరెవరితోనో చేయించి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నాడో ఏమోగాని..లలితా జ్యువెలర్స్ యజమాని మాదిరిగా తనమీదనే యాడ్ రూపొందించుకున్నాడు మల్లారెడ్డి. అది చూసిన నెటిజన్లు ఎంతైనా మల్లన్న రూటే సపరేట్ ఏది చేసినా అందులో ప్రత్యేకత, హాస్యం నిండిఉంటుందంటూ కితాబిస్తున్నారు.
తన యాడ్ లో టైం మిషన్ ట్రావెల్ చేసిన మల్లారెడ్డి తన ప్రయాణంలో ఆది శంకరాచార్యులను కలుస్తాడు. ఆయన తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యాసంస్థలను స్థాపించు మల్లారెడ్డి..తధాస్తు అని దీవిస్తాడు. అనంతరం గౌతమ బుద్దుడిని కలవగా.. విజ్ఞానాన్ని పంచే సంస్థలను స్థాపించు మల్లారెడ్డి అని బుద్ధుడు చెబుతాడు. ఆ తర్వాత మల్లారెడ్డి రాజనీతిజ్ఞుడు గురు చాణక్యుడిని కలుస్తాడు. ఆయన రాజ్యాన్ని నిర్మించే విద్యావంతులను తయారుచేయి మల్లారెడ్డి అని ప్రభోదిస్తాడు. ఇక స్వామి వివేకానందను మల్లారెడ్డి కలవగా..యువతను మేలుకొలుపు. వారిలో జ్ఞానాన్ని వెలిగించు.. విజ్ఞానాన్ని పంచే విద్యాసంస్థలను స్థాపించు అంటూ చెబుతాడు.
అనంతరం మదర్ థెరిస్సా, మహాత్మా గాంధీని మల్లారెడ్డి కలుసుకుని వారి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక మిస్సైల్ మ్యాన్, భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను మల్లారెడ్డి కలుసుకుంటాడు. అద్భుతమైన టెక్నాలజీతో.. కోర్సులతో.. రేపటి సమాజాన్ని నిర్మించు మల్లారెడ్డి అని కలాం చెబుతారు. అక్కడి నుంచి నేటి రోబోట్..ఏఐ వ్యవస్థ వరకు మల్లారెడ్డి ప్రయాణిస్తాడు. చివరగా మల్లారెడ్డి మాట్లాడుతూ మీ అందరి ఆశయాలను నిలబెడతాను.. దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతాను..ఇది మల్లారెడ్డి మాట అని పేర్కొంటాడు. అంతర్జాతీయ టెక్నాలజీ కోర్సులతో.. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మల్లారెడ్డి విద్యాసంస్థలు అంటూ ముగిసే మల్లారెడ్డి టైమ్ మిషన్ ఏఐ వీడియో యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Time machine pic.twitter.com/YkzeCbszel
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 31, 2025