Site icon vidhaatha

కేసీఆర్ కొత్త బిల్లు: గవర్నర్ తమిళిసై పవర్ కట్!

విధాత‌: కేసీఆర్‌తో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. ఒకసారి ఆయన కాదు అనుకున్నారంటే ఎందాకైనా వెళ్తారు.. ఎలాంటి పరిస్థితులు అయినా కల్పిస్తారు. చివరకు అవతలివాళ్లు దండం పెట్టాల్సిన స్థితికి తీసుకొస్తారు. ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించి వీడియోలో, ఆడియోల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు తిరిగి బుకాయించగా రిటర్న్గిఫ్ట్ ఇస్తాను అని హెచ్చరించిన కేసీఆర్ 2019 ఎన్నికల్లో తానేమిటో చూపించి చంద్రబాబును ఓటమి పాల్జేసారు.

ఎక్కడ తేడా కొట్టిందోకానీ చిన జీయర్ స్వామిని కూడా అలాగే దూరం పెట్టారు. ఇప్పుడు గవర్నర్ తమిళ సై తో కూడా యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు గవర్నర్ కు ఉన్న మరికొన్ని అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నారు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటారు. స్నాతకోత్సవాలు గవర్నర్ సమక్షంలోనే జరుగుతాయి. అయితే బెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీ గవర్నర్లతో పొసగక గవర్నర్లను ఛాన్సలర్ పదవుల్లోంచి తీసేస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించారు కానీ ఇంకా అది చట్టంగా మారలేదు. ఇప్పుడు అదే ఆస్త్రాన్ని కేసీఆర్ వాడేలా ఉన్నారు.

బెంగాల్, కేరళ తరహాలోనే గవర్నర్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అసెంబ్లీలో సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబర్ 3వ వారంలో ఐదారు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండగా ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు గవర్నర్ వ్యవహారశైలిపై చర్చించే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లోనే గవర్నర్‌ను వైస్ ఛాన్స్ లర్ పదవి నుంచి తప్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెడితేనే ఆ బిల్లు అమల్లోకి వస్తుంది. తనకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాకపోతే గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బిల్లు తేవాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది.. మరి ఈ బిల్లు ఎలా చట్ట రూపం దాలుస్తుందో చూడాలి.

Exit mobile version