Greenfield Express Highway
విధాత: జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని కలిసి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతి పత్రం అందించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని, ప్రస్తుతం ఎన్.హెచ్ 65 రహదారిని 6 వరుసల రోడ్డుగా మారుస్తున్నారని ప్రధానికి వివరించానన్నారు.
ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల పనులు జరుగుతున్నాయని, 44 కిలోమీటర్ల వరకు పనులు చేస్తున్నారని, రోజురోజుకీ ఈ రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలియచేశానన్నారు.
పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని ప్రధానికి విన్నవించానన్నారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరినట్లుగా తెలిపారు.
అలాగే హైదరాబాద్-విజయవాడలను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్ ల మరమ్మతు అంశంపై మరింత దృష్టి పెట్టాలని కోరడం జరిగిందని, ఆయా అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారన్నారు.