Site icon vidhaatha

గుజరాత్‌లో గెలిచేదెవరో?

ఉన్నమాట: గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్‌ పార్టీ, ఆప్‌ పట్టుదలతో ఉన్నాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో అక్కడి నుంచే ఆయనకు చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తున్నది. అలాగే మరోసారి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నది.

ఢిల్లీ నుంచి పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో పీఠం దక్కించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నది. అందుకే ఈసారి అక్కడ ముక్కోణపు పోటీ ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి నేతలు జంప్‌ అవుతున్నారు. పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నాయకుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌ సింగ్‌ రత్వా కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కాషాయ గూటికి చేరారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మోడీ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అంతా తానే అయి విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీన్నిబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 162 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆప్‌ పోల్‌ నిర్వహించిన తమ పార్టీ అభ్యర్థిగా ఇసుదాన్ గఢవీని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఓబీసీ నేత అయిన తనను ఎంపిక చేయడానికి కారణం అక్కడ ఓటర్లలో సుమారు 48 శాతం మంది ఓబీసీలు ఉన్నారు. మెజారిటీ ఓబీసీ ఓటర్లను ఆకర్షించడానికి ఆప్‌ ప్రయత్నిస్తున్నది.

పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను వీడటం, అలాగే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తాజాగా ఆ పార్టీ వీడటంతో అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌ సింగ్‌ వాఘేలా మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రయత్నం చేసింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు.

ఆయనతో పాటు ఆయన కుమారుడు మహేంద్రసింగ్‌ వాఘేలాతో సహా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అనంతరం శంకర్‌సింగ్‌ వాఘేలా గుజరాత్‌ అసెంబ్లీ ప్రతిపక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీని వీడారు. తర్వాత ప్రజాశక్తి డెమోక్రటిక్‌ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. రెండు వారాల కిందటే ఆయన కుమారుడు ఎమ్మెల్యే మహేంద్రసింగ్‌ వాఘేలా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. వాఘేలా కూడా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌లు గెలుపు మాదంటే మాది అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుంది అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆప్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు అంటున్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ మూడు పార్టీలలో ప్రజలు ఎవరికి పట్టం కడుతారన్నది డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపులో తేలనున్నది.

Exit mobile version