Gutta Sukhender Reddy
విధాత: ఉచిత విద్యుత్ పథకం వెనుక అవినీతి ఉందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నల్గొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కరెంటు కొనుగోళ్లు జరిగేది ఎన్ఎల్‌డీసీ నుండేనని, అలాంటప్పుడు అవినీతి జరిగిందనడం అవివేకమన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉచిత విద్యుత్తుపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు.
బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం రేవంత్ అవగాహన రాహిత్యమన్నారు. అసలు అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. ఆ సమయంలో విద్యుత్ చార్జీలు పెంచుతామన్న చంద్రబాబునాయుడిని కేసీఅర్ వ్యతిరేకించారన్నారు. ఆ విషయం అందరికి తెలుసన్నారు. ఇప్పుడు రేవంత్ దానిపై దుష్ప్రచారం చేస్తున్నాడని, రేవంత్ ఆరోపణలను ఎవ్వరు నమ్మరన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు వ్యతిరేకమేనన్నారు.
కేసీఅర్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఎక్కడైనా ఎకరం పంట ఎండిందా.. సబ్ స్టేషన్‌లల్లో ధర్నాలు జరిగాయా అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తొమ్మిదేళ్లలో ఎప్పుడైనా ఎండిన పైర్లతో అసెంబ్లీకి వచ్చారా అని, కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదన్నారు.
రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదన్నారు. ఆవారా నంబర్ వన్ రేవంత్, మతిస్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమేనన్నారు. 82 ఏళ్ల ఖర్గే ఏఐసీసీ కార్యదర్శిగా ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా, సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో ఎందుకు కొనసాగకూడదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో తెలంగాణలో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ రంగాలకు నిరంతర ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. తెలంగాణ విజయాలు ప్రతిపక్షాలకు కనబటం లేదన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ పని అని, ప్రజలు సంతోషంగా ఉంటె కాంగ్రెస్‌కు నచ్చడం లేదన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కేంద్రం అడ్డుపడుతున్నదని, అవసరమైన అనుమతులు ఇవ్వడం లేదని, బీహెచ్ఈఎల్ ద్వారానే యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతు ఆ సంస్థను సీఎం కేసీఆర్ బతికించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి (డిండి) ఎత్తిపోతలకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా నల్గొండ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే వ్యవసాయం సర్వ నాశనం అవుతుందని, తెలంగాణ ఆగమాగం అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.