Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. సినిమా విడుదల వాయిదా ప్రకటనను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా వేస్తున్నామని.. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్న నిర్మాతలు వెల్లడించారు. ఏఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈ జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతో పాటు థియేటరికల్ బిజినెస్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం..విఎఫ్ ఎక్స్ పనులు కూడా ఆలస్యమవ్వడంతో సినిమా విడుదల మరోసారి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సినిమా విడుదల ఆలస్యంతో నిర్మాత ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను చూసిన పవన్ కల్యాణ్ తన రెమ్యూనరేషన్ రూ.11కోట్లు ఏఎం రత్నంకు వెనక్కి ఇచ్చేశారు.
2020లో మొదలైన సినిమా షూటింగ్ మొదలుకుని విడుదల వరకు కూడా వాయిదా పర్వంలోనే సాగుతుంది. తొలుత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో ఆలస్యమవుతూ వచ్చిన సినిమా చిత్రీకరణ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో మరింత బిజీగా మారిపోవడంతో మరోసారి షూటింగ్ వాయిదా పడింది. సినిమా షూటింగ్ మధ్యలోనే డైరక్టర్ క్రిష్ దర్శకత్వ బాధ్యతలనుంచి తప్పుకోగా..నిర్మాత రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరక్టర్ గా చిత్రీకరణ పూర్తి చేశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా..పాటలకు మంచి ఆదరణ లభించింది. ఐదేళ్లుగా పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు తొలుత ప్రకటించిన మేరరకు ఈ నెల 12న విడుదలవుతుందనుకున్నారు. అయితే పవన్ అభిమానుల ఆశలపై సినిమా వాయిదా ప్రకటనతో నిర్మాతలు నీళ్లు చల్లినట్లయ్యింది.