విధాత : ఉత్తరప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మథుర నుంచి సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో.. దీనిపై హేమమాలిని జర్నలిస్టులు ప్రశ్నించారు.
దీనిపై హేమమాలిని స్పందిస్తూ.. తానేం మాట్లాడలేనని, అంతా దేవుడి దయ అన్నారు. కృష్ణుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడని బదులిచ్చారు. మళ్లీ క్షణాల్లోనే ఆమె స్పందిస్తూ.. మొత్తానికి మథుర నుంచి పోటీ చేసేందుకు స్థానికులకు అవకాశం ఇవ్వరన్న మాట. సినీ నటులే ఇక్కడ్నుంచి పోటీ చేయాలని మీరు భావిస్తున్నారు. ఒక వేళ సినిమా స్టార్‌లనే మథుర కోరుకుంటే.. రేపు రాఖీ సావంత్ కూడా పోటీ చేస్తారని ఎంపీ హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మథుర నుంచి 2014, 2019 ఎన్నికల్లో మాలిని గెలుపొందారు.
ఇదిలా ఉండగా.. చాలా సందర్భాల్లో కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. బీజేపీ నాయకులు సైతం ఆమెకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మథుర నుంచి బీజేపీ తరపున కంగనా పోటీ చేస్తారని వార్తలు ఊపందుకున్నాయి.