Site icon vidhaatha

నారా లోకేష్‌తో హీరో యష్ భేటీ.. ఏంది కథ?

విధాత‌: సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులో ఇది దక్షిణాదిన చాలా ఎక్కువ. ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ, అంబరీష్, సుమలత, పవన్ కళ్యాణ్ ఇలా లిస్టు చాలా పెద్దదే అవుతుంది. ఇక ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి పీఠాలను కూడా అధిరోహించారు.

ఇక విషయానికి వస్తే కన్నడ సూపర్ స్టార్ యష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసి పలువురు పలు విధాలుగా చర్చిస్తున్నారు.

నిజానికి కన్నడ నటుడు అయిన యష్‌కు.. ‘కెజియఫ్‌’తో కేవలం కర్ణాటకలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే విదేశాలలో కూడా పాపులారిటీ విపరీతంగా వచ్చింది. దానితో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. నిజానికి నేడు రాఖీ బాయ్ అనేది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. కె.జి.ఎఫ్1, కె.జి.ఎఫ్2 లతో కన్నడ స్టార్ యష్‌‌కు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది.

య‌ష్‌ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కర్ణాటకలో గౌడ సామాజిక వర్గం ఎక్కువ. దాంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలవడం చూస్తే ఈ భేటీలో రాజకీయపరమైన అంశాలు వచ్చాయా లేదంటే స్నేహపూర్వక భేటీనా అనే చర్చ సాగుతోంది.

గతంలో యష్ పూర్తిగా రాజకీయాలకు సపోర్ట్ చేసింది లేదు. క్రియాశీలకంగా వ్యవహరించలేదు. కానీ కొన్నిసార్లు బీజేపీకి మద్దతుగా మాట్లాడాడు. ఇక ఇటీవల ఆయన కన్నడ కథానాయకుడు రాజకీయ వేత్త అంబరీష్ మరణించినప్పుడు ఆయన సతీమణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ కథానాయకి సుమలత తరపున ఆమెకు మద్దతు పలుకుతూ ప్రచారం చేశాడు.

మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత పోటీ చేసినప్పుడు ఆమెకు య‌ష్‌‌తో పాటు చాలామంది కన్నడ హీరోలు ప్రచారం చేశారు. ఇక కె.జి.ఎఫ్1, కె.జి.ఎఫ్2 తర్వాత య‌ష్‌ ఏ సినిమా అంగీకరించలేదు. కేజిఎఫ్ 3 అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుందని స్వయంగా యశే తెలిపాడు.

ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు కూడా పూనుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సుమారు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా సాగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నాడు లోకేష్. ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో.. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ అంటుంది.

2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు లోకేష్ పాదయాత్రలో జనం మధ్యనే ఉండనున్నాడు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత, విద్యా, వైద్యం వంటి అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్.. యష్‌ని కలవడం ప్రాధాన్యత సంతరించు కుందని చెప్పాలి.

వాస్తవానికి ఆంధ్ర కర్ణాటకల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇక్కడి ప్రజల మధ్య కూడా అవినాభావ సంబంధం ఉంది. దాంతో య‌ష్‌ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడుతుందా? అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం. య‌ష్‌తో సినిమాలు తీయడానికి టాలీవుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు.. బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా అతని డేట్స్ ఇచ్చేస్తే చాలు అనే ఆశతో ఉన్నారు.

ఇంతగా తెలుగు వారిపై ప్రభావం చూపిన కన్నడ హీరోలు చాలా తక్కువ. ఈ కన్నడ హీరో కోసం నేడు ఇండియన్ క్రేజీ డైరెక్టర్స్ అందరూ ఎదురు చూడడం గతంలో ఎన్నడూ జరగలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. య‌ష్‌ స్వయంగా లోకేష్‌ను కలవలేదు.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దిగిన యష్‌ను కలవడానికి లోకేష్ అక్కడికి వెళ్ళాడు. నేను చంద్రబాబు నాయుడు కొడుకుని అంటూ పరిచయం చేసుకున్నాడు. నారా లోకేష్, యష్ ఇద్దరూ ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ ముచ్చటించారు. ఈ ముచ్చట చూస్తుంటే.. అతనిని ఎన్నికల ప్రచారం కోసం వాడేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే సందేహం అయితే క‌లుగుతోంది.

మన టాలీవుడ్ హీరోలు విస్తృతంగా ప్రచారం చేస్తేనే ఓట్లు పడతాయో లేదో అనే పరిస్థితి ఉన్న నేటి కాలంలో కన్నడ హీరో వచ్చి ఓటు వేయమని చెప్తే జనాలు వింటారా? అసలు భేటీ ఎందుకు జరిగింది? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈసారి ఎన్నిక‌ల‌లో సినీ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉండ‌నుంది. స్వ‌యంగా జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తానే ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డ‌ట‌మే కాకుండా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా జ‌న‌సేన త‌ర‌పున బ‌రిలో దిగే అవ‌కాశం, క‌నీసం ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే స్వ‌యంగా నాగ‌బాబు రంగంలోకి దిగాడు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తాడు అంటే కాదు త‌మ‌కు ఇస్తాడ‌ని మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి. బాల‌య్య ఎలాగూ టీడీపీనే. మ‌రి ఆయ‌న‌కోసం నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు, మ‌రోవైపు ప‌వ‌న్‌కి మ‌ద్ద‌తుగా మెగా కాంపౌండ్ హీరోలు త‌ప్ప‌కుండా బ‌రిలోకి దిగుతారు. ఇక అలీ వంటి వారితో పాటు త‌మిళ‌నాట పేరున్న విశాల్ వైసీపీకి పోటీగా కుప్పంలో బ‌రిలోకి దిగుతాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి ఈసారి ఎన్నిక‌లు పూర్తిగా సినీ రంగు పులుముకునే అవ‌కాశాల‌ను కూడా తోసిపుచ్చ‌లేం.

Exit mobile version