విధాత: మావోయిస్టు అగ్ర నేత, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర హైకోర్టు స్టే యిచ్చింది.
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, అతని వెంట ఉన్న జర్నలిస్టు హేమచంద్ర పాండే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆదిలాబాద్ అడవుల్లో2010లో చనిపోయారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని వారిని మహారాష్ట్రలోని ఓ ప్రాంతం నుంచి పట్టుకొచ్చి ఆదిలాబాద్ అడవుల్లో కాల్చిచంపారని ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర పాండే సహచరి బినీత పాండే ఆరోపించారు. న్యాయ విచారణ జరిపి దోషులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ఎన్‌కౌంటర్ బూటకమన్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. దీనిపై పద్మ, బినీత పాండే ఆదిలాబాద్ జిల్లా కోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఎన్‌కౌంటర్‌పై పునర్ విచారణ జరిపాలని కోరారు.
సుదీర్ఘ విచారణ తర్వాత ఆదిలాబాద్ కోర్టు ఆజ్‌ద్, హేమచంద్ర పాండేలది బూటకపు ఎన్‌కౌంటర్ అని తేల్చింది. కాబట్టి ఎన్‌కౌంటర్‌లో భాగస్వాములైన 29 పోలీసులను ముద్దాయిలుగా చేర్చి మూడు నెలల్లో విచారణ ముగించాలని సెషన్స్ కోర్టుకు సూచిస్తూ… మూడు వారాల క్రితం తీర్పు చెప్పింది.
ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ క్రమాన్ని పరిశీలించిన హైకోర్టు కేసు విచారణపై స్టే విధించింది.