-రాబోయే ద్రవ్యసమీక్షలో మరో పావు శాతం వడ్డింపు
విధాత: రుణాలపై వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షలో ఈసారి రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడనున్నది. ఇదే జరిగితే గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత తదితర రుణాలన్నీ మరింతగా భారం కానున్నాయి.
కరోనా నేపథ్యంలో వరుసగా వడ్డీరేట్లను తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం భయాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలతో ఇప్పుడు పెంచుతూపోతున్నది. ఈ క్రమంలోనే ఆయా రుణాల ఈఎంఐలు.. గడిచిన 9 నెలల్లో భారీగా పెరిగాయి. ఆర్బీఐ రెపో పెరిగిన ప్రతిసారి.. బ్యాంకులు సైతం తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూపోతున్నాయి.
నిరుడు మే నుంచి రెపో రేటు 2.25 శాతం (225 బేసిస్ పాయింట్లు) పెరిగింది. గత ఏడాది డిసెంబర్ సమీక్షలో 35 బేసిస్ పాయింట్లు పెరిగిన సంగతి విదితమే. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతంగా ఉన్నది. దీన్ని 6.5 శాతానికి ఈసారి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ చేర్చుతుందన్న అంచనాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.