Site icon vidhaatha

Scotland | పురాణాల్లో వ‌ర్ణించిన ఒక అరుదైన రాక్ష‌స జీవి కోసం అన్వేష‌ణ.. ఆ స‌ర‌స్సు పైనే అంద‌రి క‌ళ్లు!

Scotland |

విధాత‌: పురాణాల్లో వ‌ర్ణించిన ఒక అరుదైన జీవి కోసం చ‌రిత్ర‌లో మ‌రోసారి అన్వేష‌ణ మొద‌లైంది. వంద‌ల మంది ఔత్సాహికులు ప్ర‌పంచం నలుమూల‌ల నుంచి స్కాట్లాండ్‌ (Scotland) కు చేరుకున్నారు. ఆ అరుదైన జీవి ఉనికిని నిరూపించి చ‌రిత్ర పుటల్లో నిలిచిపోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశారు. ఆ జీవి పేరు నెస్సీ. అది ఉంద‌ని భావిస్తున్న స‌ర‌స్సు లాచ్‌. అందుకే దీనిని లాచ్ నెస్ మానిస్ట‌ర్ (Loch Ness Monster) అని పిలుస్తారు.

దీని ప్ర‌స్తావ‌న చ‌రిత్ర‌లో తొలుత 6వ శ‌తాబ్దంలో క‌నిపిస్తుంది. అదిగో.. ఇదిగో మాకు క‌నిపించిందంటూ గతంలో ప‌లువురు దీన్ని గుర్తించ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అవి స‌ఫ‌లం కాలేదు. అయితే గ‌తానికి భిన్నంగా అత్యంత సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఇప్పుడు వెదుకులాట మొద‌లైంది. ఈ సారి ఏదో ఒక స‌మాధానంతోనే తిరిగి వ‌స్తామ‌ని ఈ స‌ర్చ్ బృందాన్ని స‌మ‌న్వ‌యం చేస్తున్న లాచ్ నెస్ సెంట‌ర్ అధిప‌తి పాల్ నిక్స‌న్ పేర్కొన్నాడు. ఒక‌ప్పటి జ‌నంలా బైనాక్యుల‌ర్‌లు భుజాన వేసుకుని మేము బ‌య‌లుదేర‌డం లేదు.

స‌ర‌స్సు మొత్తాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డానికి డ్రోన్లు, భూగ‌ర్భ‌జ‌ల డ్రోన్లు, నీటి లోప‌ల శ‌బ్దాల‌ను విన‌డానికి హైడ్రోఫోన్లు, ఇన్‌ఫ్రారెడ్ కెమేరాలు ప‌ట్టుకెళుతున్నాం అని వెల్లడించాడు. ప్ర‌పంచంలో ప‌రిష్కారం ల‌భించ‌ని మిస్ట‌రీల్లో ఇదొక‌టి. ఒక‌వేళ మేము దీనిని క‌నుక్కొంటే అది ప్ర‌పంచరికార్డే క‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాము శోధించాల్సిన (Big Hunting Ever) స‌ర‌స్సు మొత్తం 37 కి.మీ పొడ‌వు 780 అడుగుల లోతు ఉంటుందని ఆయ‌న తెలిపారు.

ఈ జీవిని చూశామ‌ని చెబుతున్న వాళ్ల‌ల్లో గ్యారీ క్యాంప్‌బెల్ ముఖ్య‌మైన వారు. ఆయ‌న త‌న భార్య‌తో క‌లిసి రెండు ద‌శాబ్దాలుగా లాచ్ నీస్ మానిస్ట‌ర్ క‌నిపించిన ఘ‌ట‌న‌ల‌ను న‌మోదు చేస్తూ వ‌స్తున్నారు. 1996 వ‌ర‌కు ఈ మానిష్ట‌ర్ జీవి ఉనికిని కాక‌మ్మ క‌థ‌గా కొట్టిప‌డేసిన గ్యారీ త‌న జీవితంలో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌తో అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

1996లో ఒక రోజు లేక్ ద‌గ్గ‌ర కూర్చుని ఉండ‌గా.. ఒక వింత జీవి త‌న మెడ‌ను నీటి ఉప‌రిత‌లానికి తీసుకొచ్చి కాసేపు అలానే ఉంది. దాని మొడ పొడ‌వే ఆరు అడుగుల పొడ‌వుంది. కొన్ని నిమిషాల‌కే అది లోప‌లకి వెళ్లిపోయింది. నాకు తెలిసి అలాంటి జీవి అస‌లు భూమ్మీదే ఉంద‌ని చ‌ద‌వ‌లేదు. అప్ప‌టి నుంచి లీచ్ నీస్ గురించి న‌మ్మ‌డం మొద‌లుపెట్టాను అని గ్యారీ గుర్తుచేసుకున్నాడు.

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1000 సంద‌ర్భాల్లో ప‌లువురు ఈ వింత జీవిని చూసిన‌ట్లు త‌న ద‌గ్గ‌ర రికార్డు ఉంద‌ని తెలిపాడు. తొలుత దీని ప్ర‌స్తావ‌న 565 ఏడీలో జ‌న‌బాహుళ్యంలోకి వ‌చ్చింది. ఐరిష్ స‌న్యాసి ఒక‌రు వింత జీవిని చూసిన‌ట్లు ప్ర‌క‌టించి దాని రూపాన్ని వ‌ర్ణించాడు. 1500 నుంచి 1800 మ‌ధ్య‌లో సుమారు 21 సార్లు లాచ్ నీస్‌ను చూసిన‌ట్లు ప‌లువురు ప్ర‌క‌టించుకున్నారు. ఆధునిక కాలంలో సుమారు 1900 సంవత్స‌రంలో ఒక వ్య‌క్తి లాచ్‌నీస్‌ను చూసినట్లు అప్పటి ప్ర‌ముఖ ప‌త్రిక ద ఇన్‌వ‌ర్‌నెస్ కొరియ‌ర్ వార్త‌ను ప్ర‌చురించింది.

దీంతో ఇది అంత‌ర్జాతీయంగా ప్రముఖ విష‌యంగా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించి 1970, 1980 ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేష‌న్ జ‌రిగిన‌ప్ప‌టికీ ఎలాంటి ఆధారాలు ఆ స‌ర‌స్సులో ల‌భించ‌లేదు. అయితే దీని పేరు చెప్పుకొని స్కాట్లాండ్ ప్ర‌భుత్వానికి మాత్రం ఆర్థికంగా లాభ‌మే చేకూరుతోంది. ఈ స‌ర‌స్సును చూడ‌టానికి, అక్క‌డ అన్వేష‌ణ చేయ‌డానికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల కార‌ణంగా ఏడాదికి సుమారు 230 నుంచి 250 మిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారం జ‌రుగుతోంది.

ఆ జీవిది అని చెబుతున్న ఫొటో ఒక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అది న‌కిలీద‌ని నిపుణులు తేల్చేశారు.
కింగ్‌కాంగ్‌, గాడ్జిల్లా సినిమాల ప్ర‌భావంతో ఈ జీవిపై వ‌ర్ణ‌న‌లు,వ‌దంతులు రావ‌డం ఎక్కువైంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. బిగ్‌ఫూట్‌, స‌స్క్వాచ్ అనే జీవుల లాగానే నీస్ కూడా ఒక ఆధారం లేని కాల్ప‌నిక ఊహ అని పెద‌వి విరుస్తున్నారు. సినిమాలు, కార్టూన్‌ల‌లో ఈ పురాణ జీవుల‌ను ఎక్కువ‌గా చూపించ‌డం వ‌ల్ల ఊహ‌లు నిజ‌మ‌వుతాయ‌ని ప్ర‌జ‌లు భ్ర‌మ‌ప‌డుతున్నారని ఆంత్రోపాల‌జీ ప్రొఫెస‌ర్ మైఖేల్ ఏ లిటిల్ పేర్కొన్నారు.

వీటిని న‌మ్మి ప్ర‌జ‌లు త‌మ డ‌బ్బులు, కాలాన్ని వృథా చేస్తున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఆరు నూరైనా నూరు నూటముప్పై ఆరైనా లీచ్ నాస్ ఉనికిని కనుగొనే తీర‌తామ‌ని అన్వేష‌కులు ప్ర‌తిజ్ఞ చేసుకున్నారు. అక్క‌డికి వెళ్ల‌లేని వారి కోసం వారి ఆప‌రేష‌న్ లైవ్ లింక్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Exit mobile version