Site icon vidhaatha

జీడిమెట్ల ఆటో డ్రైవర్ హత్య కేసు.. మల్లెపూల పేరిట భార్య డ్రామా..

Hyderabad | వారిది ప్రేమ వివాహం.. ఏడేండ్ల దాంప‌త్య జీవితం సాఫీగానే సాగింది. కానీ గ‌త కొద్ది రోజుల నుంచి భార్య చెడు వ్య‌స‌నాల బాట ప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఓ బాలిక‌తో భ‌ర్త‌కు ర‌హ‌స్యంగా వివాహం చేసింది. ఈ వివాహ‌మే భ‌ర్త ప్రాణాల‌ను బలి తీసుకున్న‌ది. మ‌ట‌న్, మ‌ల్లెపూల కోసం పంపిస్తే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మ‌ట్టుబెట్టార‌ని భార్య పోలీసుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌ల ప‌రిధిలోని వెలిమ‌ల గ్రామానికి చెందిన సురేశ్(28) జీవ‌నోపాధి నిమిత్తం జీడిమెట్ల‌లోని సంజ‌య్ గాంధీన‌గ‌ర్‌కు వ‌చ్చాడు. అయితే రేణుక అనే యువ‌తితో సురేశ్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచయం కాస్త ప్రేమ‌గా మార‌డంతో.. 2016లో ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. గ‌తేడాది వ‌ర‌కు సురేశ్‌, రేణుక దాంప‌త్య జీవితం సాఫీగానే సాగింది. కొద్ది రోజుల నుంచి రేణుక మ‌ద్యం, క‌ల్లుకు బానిస అయింది. ప‌రాయి వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా ఉంటోంది. మ‌ద్యం, క‌ల్లు దుకాణాల వ‌ద్దే రేణుక క‌నిపించేది.

భ‌ర్త మెప్పు పొందేందుకు బాలిక‌తో పెళ్లి..

కొద్ది రోజుల క్రితం బ‌హ‌దూర్‌ప‌ల్లిలోని ఓ క‌ల్లు దుకాణం వ‌ద్ద దుండిగ‌ల్ తండాకు చెందిన ఓ బాలిక‌(17).. రేణుకకు ప‌రిచ‌య‌మైంది. తాను అనాథ అని చెప్ప‌డంతో.. ఆమెను రేణుక చేర‌దీసింది. అయితే తాను చెడు వ్య‌స‌నాల బారిన ప‌డ‌టంతో.. భ‌ర్త మెప్పు పొందేందుకు ఆ అనాథ బాలిక‌తో భ‌ర్త‌కు ర‌హ‌స్యంగా వివాహం చేసింది. గ‌త 15 రోజుల నుంచి రేణుక‌, సురేశ్‌, బాలిక క‌లిసి ఉంటున్నారు. బాలిక సురేశ్‌కు ద‌గ్గ‌రైంది. దీంతో సురేశ్ రేణుక‌ను వ‌దిలించుకోవాల‌ని చూశాడు. ఈ విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు చేసుకున్నాయి.

మ‌ద్యం మ‌త్తులో భ‌ర్త‌ను చంపి..

అయితే ఆదివారం రాత్రి ముగ్గురు క‌లిసి మ‌ద్యం సేవించారు. సురేశ్ గాఢ నిద్ర‌లోకి జారుకున్న త‌ర్వాత‌.. రేణుక‌, బాలిక క‌లిసి అత‌ని మెడ‌కు చున్నీని బిగించారు. ఇద్ద‌రూ క‌లిసి అత‌న్ని చంపారు. అనంత‌రం డెడ్‌బాడీని గోనె సంచిలో కుక్కారు. తాము నివాస‌ముంటున్న రెండో అంత‌స్తు నుంచి రోడ్డుపైకి సంచిని ప‌డేశారు.

ఏమి తెలియ‌న‌ట్లు బంధువుల‌కు ఫోన్లు

సురేశ్ హ‌త్య గురించి త‌మ‌కు ఏమీ తెలియ‌న‌ట్లు రేణుక అత‌ని బంధువుల‌కు ఫోన్ చేసి చెప్పింది. మ‌ట‌న్, మ‌ల్లెపూల కోసం బ‌య‌ట‌కు పంపిస్తే తిరిగి రాలేదు. తెల్ల‌వారుజామున త‌మ ఇంటి ముందు గోనె సంచిలో సురేశ్ మృత‌దేహం ల‌భ్య‌మైంద‌ని తెలిపింది. ఇక జీడిమెట్ల పోలీసుల‌కు కూడా ఈ విధంగానే ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సురేశ్ బంధువులు కూడా రేణుక‌పైనే అనుమానం వ్య‌క్తం చేశారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేప‌ట్ట‌గా, చేసిన నేరాన్ని రేణుక అంగీక‌రించింది.

Exit mobile version