Husband Murder | మొదటి భార్య కాదని రెండో వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ మొదటి భార్య సర్దుకుపోయింది. అంతే కాదు.. ఇద్దరు భార్యలు కాదని మరి కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. వారితో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి, తన మొదటి భార్యకు చూపించి వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేని భార్య అతన్ని అంతమొందించింది. ఈ దారుణ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజిపేటలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాకు జన్నారపు వేణు కుమార్, సుష్మితకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుకుమార్ చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుండగా, సుష్మిత రైల్వే లోకోషెడ్డులో టెక్నిషీయన్‌గా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం నేపథ్యంలో కాజీపేటలోని డీజిల్ కాలనీలో సుష్మిత దంపతులు నివాసం ఉంటున్నారు. కొద్ది కాలం క్రితం వేణుకుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. సుష్మిత సర్దుకుపోయింది. ఇదే అదునుగా భావించిన వేణు.. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. వారితో గడిపిన సన్నివేశాలను చిత్రీకరించడం, వాటిని తీసుకొచ్చి భార్యకు చూపించడం వేణుకు అలవాటైంది. ఈ విషయంలో చాలాసార్లు సుష్మిత గొడవ పడింది. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో వేణును వదిలించుకోవాలని సుష్మిత ప్లాన్ చేసింది.
రౌడీషీటర్‌కు రూ. 4 లక్షల సుపారీ
ఇక భర్త వేణును అంతమొందించాలని నిర్ణయించుకున్న సుష్మిత తన దగ్గరి బంధువు కొంగర అనిల్‌కు చెప్పింది. అతను రౌడీషీటర్ గడ్డం రత్నాకర్(జయశంకర్ జిల్లా, ఇస్సిపేట గ్రామం)ను సంప్రదించాడు. వేణును హత్య చేసేందుకు రూ. 4 లక్షల సుపారీ మాట్లాడి, ముందస్తుగా రూ. 2 లక్షలు చెల్లించాడు.
పథకం ప్రకారం.. పాలలో నిద్ర మాత్రలు కలిపి..
రౌడీషీటర్ పథకం ప్రకారం.. సుష్మిత ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన పాలలో నిద్ర మాత్రలు కలిపి వేణు కుమార్‌కు ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత రత్నాకర్.. వేణుకుమార్‌ను తన కారు వెనుక సీట్లో కూర్చోపెట్టుకుని మంథని వైపు వెళ్లాడు. మార్గమధ్యలో కటిక నవీన్ కారు ఎక్కాడు. మానేరు వాగులో వేణుకుమార్‌ను పడేశారు. అక్టోబర్ 3వ తేదీన మృతదేహం తేలడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు..
రత్నాకర్ సూచన మేరకు.. తనకేమీ తెలియనట్లు భర్త వేణుకుమార్ అదృశ్యమయ్యాడని అక్టోబర్ 7వ తేదీన కాజిపేట పోలీసులకు సుష్మిత ఫిర్యాదు చేసింది. భర్త ఆచూకీ తెలపండి అని పదేపదే పోలీసులను అడగ్గా, వారికి ఆమెపైనే అనుమానం వచ్చింది. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ గట్ల మహేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సుష్మిత కాల్ డేటాను విశ్లేషించారు. అనంతరం కొంగర అనిల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. రౌడీషీటర్ రత్నాకర్‌తో మాట్లాడిన రికార్డులు లభ్యమయ్యాయి. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. సుష్మిత, అనిల్, రత్నాకర్, నవీన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.