HUZURABAD | అన్నా.. కాంగ్రెస్‌లోకి వెళదాం.. ఈటలపై ఒత్తిడి పెంచిన అనుచరులు!

HUZURABAD | మనకు బీజేపీ సరిపడదు ఈటలపై ఒత్తిడి పెంచిన అనుచరులు! మౌనమే రాజేందర్‌ సమాధానం ‘అన్నా.. మనకు బీజేపీ సరిపడదే.. వీళ్లు కేసీఆర్‌ను ఎదుర్కోలేరే.. ఎవరిని పలకరించినా.. బీఆరెస్‌, బీజేపీ కలిసినయటగదా? మరి మీరు ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తరని అడుగుతున్నారన్నా.. ఇక్కడ ఇమడలేమే.. మంచో చెడో కేసీఆర్‌ మీద ఇప్పుడు పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌లోకి వెళదాం’ అంటూ ఈటల అనుచరులు, మద్దతు దారులు, ముఖ్యంగా హుజూరాబాద్‌కు చెందిన పలువురు నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు […]

  • Publish Date - June 28, 2023 / 04:23 PM IST

HUZURABAD |

  • మనకు బీజేపీ సరిపడదు
  • ఈటలపై ఒత్తిడి పెంచిన అనుచరులు!
  • మౌనమే రాజేందర్‌ సమాధానం

‘అన్నా.. మనకు బీజేపీ సరిపడదే.. వీళ్లు కేసీఆర్‌ను ఎదుర్కోలేరే.. ఎవరిని పలకరించినా.. బీఆరెస్‌, బీజేపీ కలిసినయటగదా? మరి మీరు ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తరని అడుగుతున్నారన్నా.. ఇక్కడ ఇమడలేమే.. మంచో చెడో కేసీఆర్‌ మీద ఇప్పుడు పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌లోకి వెళదాం’ అంటూ ఈటల అనుచరులు, మద్దతు దారులు, ముఖ్యంగా హుజూరాబాద్‌కు చెందిన పలువురు నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

విధాత బ్యూరో, కరీంనగర్: ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాలన్నీ ఆయన చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఆయన రాజకీయ పయనంపై అనేక ఊహగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారని, ఏ క్షణాన్నైనా అందులో నుండి బయటపడడం ఖాయమని, ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకొంటున్నారు.

ఆయనే హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్. వామపక్ష భావజాలం కలిగిన రాజేందర్.. దానికి విరుద్ధ భావాలున్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆనాడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తన సహజసిద్ధమైన దూకుడు కొనసాగించారు. పార్టీ జాతీయ నాయకత్వం అండదండలు కూడా పుష్కలంగా లభించాయి.

మరి అలాంటి నేత పార్టీని విడిపోతారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు, బీఆరెస్, బీజేపీ ఒక్కటే అన్నంతగా జరుగుతున్న ప్రచారాలు తమ ఆలోచనలకు, ఆచరణకు భిన్నంగా ఉన్నాయని ఈటల భావిస్తున్నందునే, ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే సమయంలో 20 ఏళ్లుగా ఆయన వెన్నటి ఉన్న మద్దతు దారులు ఎక్కు వ మంది లాభం లేదు పార్టీ మారుదామని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

పడిపోతున్న బిజెపి గ్రాఫ్

రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక దశలో బీఆరెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ప్రచారం జరిగింది. వరుసగా దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకునే వరకు వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించాలని భావించిన చాలా మంది కాంగ్రెస్‌, బీఆరెస్‌ నేతలు బీజేపీలో చేరారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మారాయి.

క్రమంగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోవడం మొదలైంది. బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటేనన్న అనుమానాలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఫలితంగా కాంగ్రెస్‌ పుంజుకున్నది. దీంతో ఈటల సన్నిహితులు కూడా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఇలాగే కొనసాగితే మన గ్రాఫ్ కూడా పడిపోయే ప్రమాదం ఉందని ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ఉండి కనుమరుగయ్యే కన్నా.. తమ నాయకుడు పార్టీ మారితేనే మేలన్న నిశ్చితాభిప్రాయంతో అనుచరులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని వారంతా ఈటల చెవిలో పోరుకట్టుకొని మరి చెబుతున్నట్లు సమాచారం.

మారుదామంటున్న మద్దతు దారులు

బీఆరెస్‌ నుంచి బయటకు వచ్చే వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల అంటే బీఆరెస్, బీఆరెస్ అంటే ఈటల అనే పరిస్థితులే ఉన్నాయి. ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు కొంతమంది బీఆరెస్‌లో చేరారు. మొదటి నుంచి ఆయనతో ఉన్న కొంత మంది అలాగే నిలబడగా మరికొందరు టీడీపీ, కాంగ్రెస్‌నుంచి వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. వీరంతా మరో ప్రశ్నకు తావు లేకుండా ఈటలను సమర్ధించగలవారే.

ఈటల ఏ పార్టీలో ఉన్నా తమ మద్దతు ఉంటుందంటుని చెబుతున్నవారే. పార్టీ మారాలని చెప్పడం తమ బాధ్యత అని, నిర్ణయం మాత్రం ఆయనదేనని జమ్మికుంటకు చెందిన ఒక నాయకుడు చెప్పారు. నియోజకవర్గంలోని ఈటల మద్దతుదారులలో మెజారిటీ నేతలు ఆయనను పార్టీ మారాలని కోరింది వాస్తవమేనని, అయితే ఈ విషయంలో ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారని హుజూరాబాద్‌కు చెందిన మరో నేత చెప్పారు. పార్టీ మారితే బాగుంటుందనేది మా అభిప్రాయమని, నిర్ణయం ఆయనకే వదిలేస్తున్నామని కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ నేత తెలిపారు.

కొంతకాలంగా కాంగ్రెస్ పుంజుకుంటుందనే ప్రచారం గ్రామీణ ప్రాంతాలలో జరుగుతోంది. దానిని అందిపుచ్చుకుంటే బాగుంటుందని చెబుతూ వస్తున్నాం, మా నేతకు విషయాలు చెప్పడం తప్ప, అంతిమ నిర్ణయం ఆయనదేనని ఇల్లంతకుంటకు చెందిన మద్దతుదారుడు అన్నారు.

పార్టీ మారాలన్నతమ కోరికను వెల్లడించడానికి, ముందు మేమంతా సమావేశం కావాలని నిర్ణయించామని, ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి కార్యాచరణ ఉంటుందని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత ఒకరు అన్నారు. అయితే ఈటలను వదిలి వెళ్లే క్యాడర్ ఎవరూ లేరని, అంతిమంగా నిర్ణయాధికారం అయినదేనని సదరు నేత అన్నారు.