విధాత: ఏదైనా ఇష్టం లేని పని చేయాలన్నా.. ఇష్టం లేని సమాధానం చెప్పాలన్నా.. ఆ నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేయడం లేదా వారు చేస్తే నేను చేస్తానని వంతు పెట్టడం చేస్తారు. ఇది సాధారణంగా చిన్న పిల్లలు చేసే పని. కానీ ఇష్టం లేని పని ఎగగొట్టేందుకు ఇది తిరుగు లేని అస్త్రం. కానీ దీనినే మన సినీ హీరోలు భలే వాడుకుంటున్నారు. భలే తెలివి అంటే ఇదే కాబోలు. బహుశా అతి తెలివి కూడా.
ఇక తెలుగు వాడైన విశాల్ కృష్ణారెడ్డి గురించి తెలిసిందే. ఎస్పీ పరశురాం వంటి చిత్రాన్ని చిరంజీవితో తీసిన ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి తనయుడు. స్వతహాగా తెలుగు వాడు కానీ.. తమిళంలో తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. తమిళంలో చిత్రాలు చేసినప్పటికీ వాటిని తెలుగులో కూడా రెగ్యులర్‌గా సొంతంగా విడుదల చేస్తూనే ఉంటాడు.
ప్రేమ చదరంగం, పందెంకోడి, సత్యం, పిస్తా, వాడు వీడు, కిలాడి, పల్నాడు, పూజ, వీరుడు, జయ సూర్య, మగమహారాజు, ఒక్కడొచ్చాడు, రాయుడు, కథాకళి, డిటెక్టివ్, అభిమన్యుడు, పందెంకోడి2, యాక్షన్, చక్ర, ఎనిమి వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.
ప్రేమ చదరంగం, పందెంకోడి, డిటెక్టివ్, అభిమన్యుడు వంటి చిత్రాలు ఈయనకు బాగా పేరును తీసుకుని వచ్చాయి. యాక్షన్ హీరోగా ఈయనకు మంచి పేరుంది. ప్రస్తుతం విశాల్ ‘లాఠీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది.. టీజర్ వంటి వాటికి మంచి ఆదరణ లభించింది. ఇంకా తమిళనాట ఇతను వివాదాస్పద నటుడు కూడా.
దక్షిణ భారత నటీనటుల సంఘం నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శి. 46 ఏళ్ల విశాల్ గత నాలుగేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దేనికో ఒక దానికి ముడి పెడుతూ వస్తున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ.. ఆ బిల్డింగ్ మూడేళ్ల నుంచి నిర్మాణంలో ఉంది.
మొదటగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అది తూచ్ అయింది. మూడేళ్ల కిందట హైదరాబాద్‌కి చెందిన అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేలా కనిపించాడు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ పెళ్లి మాత్రం ఆగిపోయింది.
విశాల్ ప్రస్తుతం ఓ నటితో డేటింగ్‌లో ఉన్నాడు. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. కానీ ఆమె పేరును చెప్పేందుకు నిరాకరించాడు. విశాల్ సినిమాలలో రెగ్యులర్‌గా కనిపించే నటి అభినయ పేరుని ప్రస్తావించగా ఆమె కాదని స్పష్టం చేశాడు. అభినయ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కానీ చాలా వరకు హీరోల చెల్లెలు పాత్రలే ఆమెకి దక్కాయి.
కానీ తమిళంలో మాత్రం ఆమె చాలా బిజీ నటి. త్వరలో తాను పెళ్లి చేసుకోబోయే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తానని స్పష్టం చేశాడు. మరోసారి ఈయన పెళ్లి గురించి అడిగితే తమిళ హీరో ఆర్యని పెళ్లి చేసుకోమనండి తర్వాత చేసుకుంటానన్నాడు. కానీ ఆర్యకు పెళ్లయి ఇప్పుడు బిడ్డ కూడా ఉన్నాడు. తాజాగా విశాల్ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముందుగా ప్రభాస్‌ను పెళ్లి చేసుకోమనండి అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి రోజునే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.
ఇక ప్రభాస్ పెళ్లి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్లి చేసుకుంటే చూడాలని కుటుంబం నుంచి అభిమానుల వరకు ఎదురుచూస్తున్నారు. ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి కోరిక కూడా అదే.
ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాలుగు పదుల వయసు దాటినా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన పెళ్లి గురించి అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఒకటే ముచ్చట. దీనినే అవకాశంగా తీసుకొని విశాల్ వంటి పెళ్లి కానీ ప్రసాద్‌లు, పెళ్లి ఇష్టం లేని ప్రసాద్‌లు ఆ నెపాన్ని ప్రభాస్ మీద తోసేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మన యంగ్ హీరోలను పెళ్లెప్పుడు అంటే అరే మాకంటే చాలా పెద్ద అయిన ప్రభాసే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. మాకెందుకు తొందర. ప్రభాస్ పెళ్లి అయ్యాక చేసుకుంటాము… అంటున్నారు. ఇదే సమాధానం ఇటీవల అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఎదుట హీరో శర్వానంద్ అన్నాడు. ఇంకా విశాల్ అయితే పెళ్లి గురించి చాలా బరువు మాటలు చెప్పాడు.
పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా పెళ్లంటే భయం పుట్టేలా మాట్లాడాడు. పెళ్లి అనేది జోక్ కాదు ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం వర్క్ లైఫ్ మీదనే ఉంది అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రభాస్ పెళ్లితో ఈ హీరోలందరూ ముడిపెట్టి హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.. కాదంటారా..!