విధాత : దీపావళి పండుగ అనగానే పటాకులు గుర్తొస్తాయి. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు కాలుస్తుంటారు. దీంతో ముసలివారు, చిన్న పిల్లలు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. నగరాల్లో అయితే పటాకులను కాల్చడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంటది.
ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పటాకులు విక్రయించొద్దు అని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన విడుదల చేశారు. పటాకులు విక్రయించినా, కాల్చినా జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు.
పటాకులు విక్రయించిన వారికి రూ. 5 వేల జరిమానాతో మూడేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. పటాకులను కాల్చిన వారికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 200 జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.