Site icon vidhaatha

Sonia Gandhi | వెంటనే కోటా అమలు చేయాలి.. అది అసాధ్యమేమీ కాదు: సోనియాగాంధీ

Sonia Gandhi

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. ‘నారీ శక్తి వందన్‌ అభినియం-2023కి కాంగ్రెస్‌ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాను’ అని ఆమె ప్రకటించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా వర్తింపజేస్తూ సత్వరమే బిల్లును అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఓపికను అంచనా వేయడం సాధ్యం కాదని, విశ్రాంతి ఆలోచనే వారికి రాదని చెప్పారు. మహిళలు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా అది భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు.

‘గత పదమూడేళ్లుగా భారతీయ మహిళలు రాజకీయ బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఇంకా కొన్నేళ్లు ఆగమని చెబుతున్నారు. ఇంకెన్నేళ్లు? ఈ తరహా వైఖరి సరైనదేనా?’ అని ఆమె ప్రశ్నించారు. అడ్డంకులు తొలగించి సత్వరమే బిల్లును అమలు చేయడం అత్యవసరమని చెప్పారు. అలా చేయడం అసాధ్యం ఏమీ కాదని అన్నారు.

ఇది తన వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలతో ముడిపడిన రోజన్న సోనియా.. మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన రాజ్యాంగ సవరణను తన భర్త రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ బిల్లు ఆమోదంతో ఆయన కల పరిపూర్ణం అవుతుందని చెప్పారు. అంతకు ముందు లోక్‌సభలో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. ఇది చాలా ముఖ్యమైనదని, సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

సత్వరమే బిల్లు అమలు చేయాలి: బీఎస్పీ అధినేత్రి మాయావతి

మహిళా రిజర్వేషన్‌ అమలుకు జన గణన, నియోజకవర్గాల పునర్విభజనతో లంకె తొలగించాలని లేదంటే అమలు ప్రక్రియ మరింత జాప్యం అవుతుందని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. బుధవారం ఆమె లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కోటాను సత్వరమే అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు.

కొన్ని ఎన్నికల తర్వాత లేదా కనీసం 15, 16 ఏళ్ల తర్వాత మాత్రమే మహిళలకు ప్రయోజనం కల్పించేలా బిల్లులోని అంశాలు ఉన్నాయని ఆమె విమర్శించారు. జన గణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం చూస్తే.. ఈ బిల్లును సత్వరమే అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని అన్నారు.

Exit mobile version