Site icon vidhaatha

2022లో 28,522 మ‌ర్డ‌ర్ కేసులు.. అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే

న్యూఢిల్లీ : గ‌తేడాది దేశంలో చోటు చేసుకున్న మ‌ర్డ‌ర్ కేసుల‌కు సంబంధించి నేష‌న‌ల్ క్రైమ్ బ్యూరో రికార్డు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది. 2022లో దేశ వ్యాప్తంగా 28,522 మ‌ర్డ‌ర్ కేసులు న‌మోదు కాగా, అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో, అత్య‌ల్పంగా సిక్కింలో న‌మోదైన‌ట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. అయితే ప్ర‌తి రోజు స‌గ‌టున 78 హ‌త్య కేసులు లేదా ప్ర‌తి గంట‌కు మూడుకు పైగా మ‌ర్డ‌ర్ జ‌రిగినట్లు ఎన్‌సీఆర్‌బీ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.


2020లో న‌మోదైన 29,193 హత్య కేసులు, 2021లో నమోదైన 29,272 హత్య కేసుల కంటే 2022లో నమోదైన మర్డర్‌ కేసులు తక్కువేనని ఎన్‌సీఆర్‌బీ స్ప‌ష్టం చేసింది. 2022లో వివాదాల కార‌ణంగా అత్య‌ధికంగా 9,962 హ‌త్య కేసులు న‌మోదైనట్లు తెలిపింది. వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం వల్ల 3,761 హత్య కేసులు, సొంత లాభం కోసం 1,884 హత్యలు జరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది.


ఇక రాష్ట్రాల వారీగా మ‌ర్డ‌ర్ కేసులను ప‌రిశీలిస్తే 3,491 హ‌త్య కేసుల‌తో యూపీ ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. బీహార్ 2,930 కేసుల‌తో ద్వితీయ స్థానంలో ఉంది. మ‌హారాష్ట్ర‌లో 2,295, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 1,978, రాజ‌స్థాన్‌లో 1,834 కేసులు న‌మోదు అయ్యాయి. అత్య‌ల్పంగా సిక్కింలో కేవ‌లం 9 కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతం ల‌క్ష‌ద్వీప్‌లో ఎలాంటి మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు కాలేద‌ని ఎన్‌సీఆర్‌బీ స్ప‌ష్టం చేసింది. హత్యకు గురైన వారిలో మహిళలు 8,125 మంది, థర్డ్ జెండర్ వ్యక్తులు 9 మంది కాగా పురుషులు 70 శాతం మంది ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.

Exit mobile version