పాల‌స్తీనియ‌న్ల‌కు ఇండియా సంఘీభావం

ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఇక్క‌డి పాల‌స్తీనా దౌత్య కార్యాల‌యాన్ని సంద‌ర్శించి, త‌మ సంఘీభావం తెలిపారు

  • ఆ దేశ ఎంబ‌సీని సంద‌ర్శించిన‌ విప‌క్షాలు

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఇక్క‌డి పాల‌స్తీనా దౌత్య కార్యాల‌యాన్ని సంద‌ర్శించి, త‌మ సంఘీభావం తెలిపారు. పాలస్తీనా రాయబారితో కలిసి ప్ర‌పంచ రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియ‌జేశారు. ఈ సందర్భంగా దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ పాల‌స్తీనా ప్ర‌జ‌ల‌కు సంఘీభావం తెలిపేందుకు తాము ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్టు తెలిపారు. గాజా ఎదుర్కొంటున్న మాన‌వ‌తా సంక్షోభానికి స‌త్వ‌ర‌మే ముగింపు ప‌ల‌కాల‌ని అన్నారు. పీడిత ప్ర‌జ‌లకే త‌మ సంఘీభావం ఉంటుంద‌ని తెలిపారు. తాము శాంతిని కోరుకుంటున్నామ‌ని, శాంతి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఎల్ల‌కాలం అందుకోసమే పోరాడుతుంటామ‌ని చెప్పారు.

ఇప్పుడు గాజాలో జ‌రుగుతున్న మాన‌వ మార‌ణ‌హోమం అక్క‌డితో ఆగిపోద‌ని, అది క్ర‌మంగా ప్ర‌పంచాన్ని మూడో ప్ర‌పంచ యుద్ధం వైపు నెడుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ యుద్ధం తీవ్ర‌త‌ర‌మైతే.. ప్ర‌పంచ రాజ‌కీయ ప‌రిణామాలు కూడా మారిపోతాయ‌ని చెప్పారు. దౌత్య కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన‌వారిలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మణిశంకర్ అయ్యర్, జనతాదళ్ యునైటెడ్ నుంచి కేసీ త్యాగి, సీపీఐ ఎంఎల్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, సమాజ్ వాది ఎంపీ జావేద్ అలీ ఖాన్ త‌దిత‌రులు ఉన్నారు.

Latest News