Ravi Shastri |
భారత జట్టుకు ఆడుతున్న కొందరు కీలక బౌలర్లు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శాశ్వత నివాసితులుగా మారారంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ఆ ఆటగాళ్లెవరో పేర్లు ప్రస్తావించకుండానే మాజీ కోచ్ విమర్శలు గుప్పించారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఐపీఎల్‌లో చైన్నై తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ను ఉద్దేశించేనని తెలుస్తున్నది.
దీపక్ గత ఎనిమిది నెలల్లో మూడుసార్లు గాయాల బారిన పడ్డాడు. నితిన్ పటేల్ నేతృత్వంలోని స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ అతన్ని ఫిట్‌గా ప్రకటించింది. ఇటీవల ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేయగలిగాడు.
ఆ తర్వాత కుంటుతూ మైదానాన్ని వీడాడు. చాహర్ స్నాయువు గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఇటీవల ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, ప్రసిద్ధ కృష్ణ గాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో రవిశాస్త్రి స్పందిస్తూ గత మూడు నాలుగేళ్లలో ఎన్‌సీఏలో చాలా మంది శాశ్వత నివాసితులుగా మారారన్నారు.
ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదని.. కొంత మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో ఆడడం లేదని, కానీ వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌లలో నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్ వేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎన్‌సీఏకు ఎందుకు వెళ్తున్నారు.. మళ్లీ మూడు మ్యాచ్‌లు ఆడి తిరిగి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. దీపక్ చాహర్ 2022 ఐపీఎల్ సీజన్‌లో గాయం కారణం ఆడలేకపోయాడు. చాలా రోజుల పాటు టీమిండియాకు దూరమయ్యాడు. గాయం నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లోనూ చోటు దక్కలేదు. అయితే, తాజాగా గాయపడ్డ దీపక్ చాహర్‌ను పూర్తిగా తప్పుకుంటున్నాడని చెన్నై జట్టు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎప్పుడు పునరాగమనం చేస్తాడో తెలియాల్సి ఉంది.
ముంబయితో మ్యాచ్ అనంతరం సురేశ్ రైనా మాట్లాడుతూ దీపక్ నాలుగైదు మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని చెప్పాడు. మళ్లీ స్నాయువు గాయంతో బాధపడుతున్నాడని, అసౌకర్యంగా కనిపిస్తున్నాడని చెప్పాడు. ఇక ఐపీఎల్‌లో దీపక్ చాహర్ 66 మ్యాచ్‌లు ఆడి.. 59 వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.