Site icon vidhaatha

పేట్‌బషీరాబాద్‌లో ల్యాండ్‌ మాఫియా!


విధాత‌: హైదరాబాద్‌ న‌గ‌రంలో భూ మాఫియా రెచ్చిపోతున్న‌ది. ఖాళీ జాగా క‌నిపిస్తే చాలు క‌బ్జా చేస్తున్నారు. అక్క‌డ కొంత మందిని పెట్టి ఆ భూమి మొత్తం త‌మ క‌నుస‌న్న‌ల్లోనే ఉంద‌నిపిస్తున్నారు. క‌బ్జా చేసిన భూముల‌ను త‌మ భూములుగా చెప్పుకొని అంగ‌ట్లో య‌థేచ్ఛగా విక్ర‌యానికి పెట్టారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ భూములు కూడా తమవేనని అందరినీ నమ్మించేందుకు ప‌క‌డ్బందీగా డాక్యుమెంట్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఇలా త‌ప్పుడు డాక్యుమెంట్లు చూపించి భూములు అమ్మ‌కొని సొమ్ము చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. స‌ర్కారు ఏదైనా స‌రే తమకేమీ భ‌యం లేద‌న్న తీరుగా ఈ భూ మాఫియా వ్య‌వ‌హ‌రిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


జర్నలిస్టుల భూమిపై కబ్జాకోరుల కన్ను


ప్ర‌భుత్వం కొన్నేళ్లక్రితం జ‌ర్న‌లిస్టులకు పేట్‌బషీరాబాద్‌లో కేటాయించిన స్థ‌లాన్ని కొందరు తాజాగా మార్కెట్‌లో అమ్మ‌కానికి పెట్టినట్టు తెలుస్తున్నది. బ‌హిరంగ మార్కెట్‌లో ఎక‌రం 30 కోట్ల‌కు పైగా విలువ ఉన్నఈ భూమిని ఆసాంతం ఆక్ర‌మించ‌డానికి కుట్ర‌లు చేస్తున్నారని సమాచారం. భూ మాఫియా అమ్మ‌కానికి పెట్టిన ఈ భూమి విలువ దాదాపు రెండు వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఈ భూమిని విక్ర‌యించ‌డానికి ర‌క‌ర‌కాల డాక్యుమెంట్లు రూపొందించి, ఈ స్థ‌లం తమదేనంటూ విక్రయించ‌డానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.


ఎకరం 30 కోట్లపైనే!


భూ మాఫియా అమ్మ‌కానికి పెట్టిన భూమి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. మేడ్చ‌ల్‌ మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్ బ‌షీరాబాద్ రెవెన్యూ గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 25/2లో 59 ఎక‌రాల 35 గుంట‌ల భూమి ఉన్న‌ది. నాగపూర్ హైవేకు ఆనుకొని ఉన్న‌ది కావ‌డంతో ఈ భూమి విలువ బ‌హిరంగ మార్కెట్‌లో ఎక‌రం రూ.30 కోట్ల‌కు పై చిలుకు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన ఈ భూమిపై క‌న్నేసిన భూ మాఫియా దీనిని కాజేసే ప‌నిలో ఉంది.


వాస్త‌వానికి ఇందులో 38 ఎక‌రాల భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్‌ హౌసింగ్ సొసైటీకి 2007-08 మ‌ధ్య కాలంలో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేటాయించింది. అదే ఏడాది సెయింట్‌ ఆన్స్ స్కూల్‌కు, పోలీస్‌స్టేష‌న్‌కు కూడా ఇదే సర్వే నంబర్‌లోని భూమిని కేటాయించారు. అయితే కోర్టులో సొసైటీకి స్థ‌లం కేటాయించడాన్నిస‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్ సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లి అక్క‌డ‌ సుదీర్ఘ కాలం కేసు నడిచింది.


గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ.. అప్పటి బీఆరెస్‌ ప్రభుత్వం ఈ స్థలాన్ని సొసైటీకి అప్పగించడంలో తీవ్ర నాన్చివేత వైఖరిని అనుసరించింది. తర్వాత వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం ఇంత వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. స్థ‌లాన్నిఅప్ప‌గించ‌డంలో దీర్ఘకాలంగా జరుగుతున్న జాప్యం కార‌ణంగా ఆ భూమి ఖాళీగా పడి ఉన్నది. దీంతో రెచ్చిపోతున్న భూ మాఫియా ఈ భూమిని క‌బ్జా చేసే ప‌నిలో ఉంది.


రికార్డులు ఏం చెబుతున్నాయి?


ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిషేధిత భూముల జాబితాను ప‌రిశీలిస్తే దీనిపై మూడు నాలుగు ర‌కాల ప‌ద్ధతుల్లో నిషేధిత జాబితాలో పెట్టిన‌ట్లు చూపిస్తోంది. 2015 జ‌న‌వ‌రి 6వ తేదీన స‌ర్వే నంబ‌ర్ 25/2లో 38 ఎక‌రాల భూమిని లెట‌ర్ నంబ‌ర్ బీ5/348/2014 ద్వారా హెచ్ఎండీఏ పంచ‌నామా చేసి పొజిషన్‌ తీసుకున్న‌ట్లుగా ఉంది. ఈ భూమి మొత్తం త‌మ పొజిష‌న్‌లోనే ఉన్న‌ద‌ని హెచ్‌ఎండీఏ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఎవ్వ‌రూ దానిని రిజిస్ట‌ర్ చేయ‌డానికి వీలు లేకుండా ఐజీఆర్ఎస్‌లో సదరు లేఖ‌ను పొందుప‌రిచింది.


మ‌రోచోట 28 ఎక‌రాల 21 గుంట‌ల భూమికి డబ్ల్యూపీ నంబర్‌ 9187/2016లో అదే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన డబ్ల్యూపీఎంపీ నం.11643/2016లో న‌వీన్ ఆకుల అనే వ్యక్తి ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా తీసుకు వ‌చ్చిన‌ స్టే ఆర్డ‌ర్‌ను 2022 మే 23వ తేదీన ఐజీఆర్ఎస్‌లో న‌మోదు చేసింది. దీనిపై ప్ర‌భుత్వం 2021 మార్చి 4వ తేదీన‌ స్టే వెకేట్ పిటిష‌న్ వేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి ఆర్డ‌ర్ రాలేదు.


2021 సెప్టెంబ‌ర్‌ 20వ తేదీ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు కూడా విచార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు లేదు. ఈ మేర‌కు హైకోర్టు వెబ్‌సైట్ కూడా చూపించ‌డం లేదు. అలాగే ఖ‌దీర్ హుస్సేన్ 100 గ‌జాల‌కు ఓఎస్‌ నం.360/2019లో కేసు వేసి, స్టే ఆర్డ‌ర్ తీసుకువ‌చ్చిన‌ట్లుగా వెబ్‌సైట్‌లో ఉంది. ఇది కాకుండా ప్ర‌భుత్వం 2013 సెప్టెంబ‌ర్‌ 25వ తేదీన స‌ర్వే నంబ‌ర్ 25/2లోని 59.35 గుంట‌ల భూమి మొత్తం ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని 2007 జూన్‌20వ తేదీన‌ డిక్లేర్ చేస్తూ విడుద‌ల చేసిన 863 జీవోను ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది.


ఇలా ఈ భూమి ఎటు నుంచి చూసినా ప్ర‌భుత్వానిదే. అయితే 2007లో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో కానీ, 2015లో హెచ్ఎండీఏ లెట‌ర్‌ను కానీ పరిశీలిస్తే అప్ప‌టికీ ఈ భూమిపై ఎలాంటి వివాదాలు ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. పైగా ఈ భూమి మొత్తం ప్ర‌భుత్వం ఆధీనంలోనే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతున్నది. కానీ భూమికి బ‌హిరంగ మార్కెట్‌లో అసాధార‌ణంగా విలువ‌పెర‌గ‌డంతో భూ మాఫియా రంగంలోకి దిగింది. కేసులు వేసింది. ఎలాగైనా భూమిని వివాదంలో పెట్టి కొట్టేయాల‌ని చూస్తోంది.


అయితే స్టే వెకేట్ పిటిష‌న్ కూడా సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉండ‌టంతో ఇదే అద‌నుగా భూ మాఫియా ఈ భూమి మొత్తం తమదేనని, మండ‌ల ఆఫీసులో మ్యూటేష‌న్ మాత్ర‌మే పెండింగ్‌లో ఉన్నదంటూ పెద్ద పెద్ద కంపెనీల‌కు విక్రయానికి పెట్టారని సమాచారం. మ‌రో వైపు 100 గ‌జాలు, 200 గజాలు అమ్మిన‌ట్లు చూపించి ఈసీలో క్ర‌య‌విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా చూపిస్తున్నారు. మ‌రోవైపు 25/2 స‌ర్వే నంబ‌ర్‌కు పార్ట్ 25/1 స‌ర్వే నంబ‌ర్‌ను లింక్ చేసి, రిజిస్ట్రేష‌న్లు చేయిస్తున్న‌ట్లుగా ఈసీలో క‌నిపిస్తోంది. భూ మాఫియా ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాల‌కు ప్ర‌యత్నిస్తుంటే.. ప్రభుత్వ వ్య‌వ‌స్థ‌లు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


అది ప్రభుత్వ భూమే


ఈ భూమిపై కుత్బుల్లాపూర్ తాసిల్దార్‌ను వివ‌ర‌ణ కోరగా.. ఇది ప్ర‌భుత్వం భూమి అని, తాము హెచ్ఎండీఏకు అప్ప‌గించామ‌ని తెలిపారు.


ఎన్నిక‌ల కోడ్ ముగిసిన నెల రోజుల్లో పేట బ‌షీరాబాద్ స్థ‌లం అప్ప‌గిస్తాం

ఎన్నిక‌ల కోడ్ ముగిసిన వెంట‌నే జ‌వ‌హ‌ర్‌లాల్ హౌసింగ్ సొసైటీకి ఫ‌స్ట్ ప్రియార్టీతో పేట బ‌షీరాబాద్ స్థ‌లం అప్ప‌గిస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి హామీ ఇచ్చిన‌ట్లు జేఎన్‌జే పాల‌క మండ‌లి డైరెక్ట‌ర్లు బొమ్మ‌గాని కిర‌ణ్ కుమార్‌, వంశీ శ్రీ‌నివాస్‌, ర‌వికాంత్ రెడ్డి, ర‌మ‌ణారావు, అశోక్‌రెడ్డిలు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించిన మంత్రి జర్న‌లిస్ట్‌ల ఇండ్ల స్థ‌లాల అప్ప‌గింత‌పై అడుగ‌గా జెఎన్ జె హౌజింగ్ సోసైటీ తీర్పుపై అవగాహన ఉన్నదని చెప్పార‌న్నారు. తాము అధికారంలోకి వచ్చి 90, 95 రోజులే అయ్యాయని, ఈ లోపు ఎన్నికలు వచ్చాయని తెలిపార‌న్నారు. మీ అంశంపై ప్రభుత్వం క్లియర్ గా ఉన్నదని, ఎన్నికల షెడ్యూల్ పూర్తయిన నెల రోజుల లోపే మీ జెఎన్ జె సొసైటీకి పేట్ బ‌షీరాబాద్‌ భూమిని అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చిన‌ట్లు సొసైటీ డైరెక్ట‌ర్లు పేర్కొన్నారు.

Exit mobile version