Secretariat SC ST Promotions | ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అణచివేత.. ఐదుగురు మంత్రులున్నా అన్యాయమే!

దళిత, బహుజన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నెలకొల్పిన సచివాలయంలో అదే అణగారిన వర్గాలకు పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Ambedkar Secretariat irony SC ST promotions

విధాత, హైదరాబాద్:
Secretariat SC ST Promotions | తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు! కానీ ఆయన లక్ష్యాలకు గత బీఆర్ఎస్ సర్కార్ తూట్లు పొడించిందన్న విమర్శలు ఇప్పటికీ బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ కారణంగా సచివాలయంలోనే సుమారు 200 మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతులు కోల్పోయారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ కుట్రలో తెలంగాణ సచివాలయ సంఘం ముఖ్య నేత ఒక కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేనిపోని అబద్ధాలు చెప్పి.. పదోన్నతులు రాకుండా అడ్డుకున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వీరికి నిరాశే ఎదురవుతోంది. నలుగురు ఎస్సీ మంత్రులు, ఒక ఆదివాసీ బిడ్డ మంత్రిగా ఉన్నా.. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ కోటా పదోన్నతులలో మొండి చెయ్యే లభిస్తోందని అంటున్నారు.

అయితే 2016లో తెలంగాణ సచివాలయ సంఘం ఒక ముఖ్య నేత సలహా మేరకు ఒక ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు తమ కోటాకు మించి రిజర్వేషన్ కోటాలో పదోన్నతులు పొందుతున్నారనేది ఆ పిటిషన్‌ సారాంశం. వాదోపవాదనల తరువాత రిజర్వేషన్ పదోన్నతుల విధానంలో తప్పేమీ లేదని, దానిని కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు నడుస్తుండగానే, ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. పదోన్నతులలో రిజర్వేషన్ల పై కమిటీ సుదీర్ఘంగా సమీక్షలు, చర్చలు జరిపిన తరువాత కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రిజర్వేషన్ పదోన్నతులలో ఎలాంటి ఉల్లంఘనలు లేవని, నిబంధనలకు అనుగుణంగానే ఇస్తున్నారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన అప్పటి ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్… హైకోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించారు.

బీఆర్ఎస్ హయాంలో ఎస్సీలు, ఎస్టీలు మంత్రులుగా ఉన్నా నోరు ఎత్తలేని పరిస్థితి ఉండేదన్న వాదనలు అప్పట్లో వినిపించేవి. ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బదులు ఏకస్వామ్యం అమలు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సర్వాధికారిగా వ్యవహరిస్తారని, మంత్రులు తమ కులానికి లేదా వర్గానికి చెందిన వారికి అన్యాయం జరుగుతున్నా మౌనం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయని వారు పేర్కొటున్నారు.

తమకు అన్యాయం జరుగుతున్నదని, పదోన్నతులలో రిజర్వేషన్ అమలు చేయకుండా అణచివేస్తున్నారని బాధిత అధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం కూడా అందచేశారు. సచివాలయం సాక్షిగా జరుగుతున్న ఈ అణచివేతపై ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ మంత్రులు సమీక్షించి న్యాయం చేయాలని ఆ వర్గాలకు చెందిన అధికారులు కోరుతున్నారు.

Latest News