విధాత, హైదరాబాద్:
అంతరించి పోతున్న దేశీయ, సంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ, వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీలోకి తీసుకు రావాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు. బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ విత్తనాలతోనే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాన్‌పల్లిలోని ఎర్త్ సెంటర్‌లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్–సీజీఆర్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ… బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయమన్నారు. మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒక వంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని ఆయన రైతాంగాన్నిహెచ్చరించారు.
సంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు. అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు.
ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందని CGR ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు. CGR వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ… మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగ లో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆహార వ్యవస్థ లో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.
రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు.
రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సంప్రదాయ వ్యవసాయం పై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’ కి నాబార్డు మద్దతిస్తున్నట్టు ‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం CGR చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
