Seed Festival: ఏప్రిల్ 4 నుంచి తెలంగాణ తొలి విత్తన పండుగ.. విత్తన ప్రేమికులకు నిజంగా పండగే!

Seed Festival |
కొన్ని పంటలకు సంబంధించిన వేల రకాల సంప్రదాయ విత్తనాలను ఒకే చోట చూడాలనుకుంటున్నారా? రైతులు, సంప్రదాయ విత్తన సంరక్షకులు, విత్తనాలను కొన్ని తరాలుగా కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలు, అనుభవాలు వినాలనుకుంటున్నారా? వారితో మాట్లాడాలనుకుంటున్నారా? అన్నింటికీ మించి మంచి విత్తనాలు పొందాలనుకుంటున్నారా? మీ వద్ద తరతరాల వారసత్వంగా వచ్చిన విత్తనాలను మరొకరితో పంచుకుందామని భావిస్తున్నారా? అందుకోసమే ఏర్పాటవుతున్నది తెలంగాణ తొలి విత్తన పండుగ.
రాష్ట్రంలో ప్రపథమంగా నిర్వహిస్తున్న పండుగను ఆరోగ్యానికి ఆహారం థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ హైదరాబాద్ శివార్లలో కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామంలో ఉన్న.. ది ఎర్త్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ విత్తన పండుగకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అయితే కార్యక్రమాలు నిర్వహించాలనుకునేవారు, తమ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా తమ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ముందు వచ్చినవారికే ముందు అవకాశం పద్ధతిని స్టాల్స్‌కు స్థలాలు కేటాయిస్తారు.
ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ అంశాలపై ప్రసంగాలు, వర్క్‌షాప్‌లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విత్తనాలకు సంబంధించిన సినిమా ప్రదర్శనలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, సంగీతం, గిరిజన నృత్యాలు వంటివి అలరించనున్నాయి. పుస్తకాలు, ప్రకృతి అనుకూల ఉత్పత్తులు, సంప్రదాయ కళలు, హస్తకళల ప్రదర్శన, విక్రయాలు కూడా ఉంటాయి. మొత్తం ప్రకృతి చుట్టూనే తిరిగే ఈ కార్యక్రమంలో ఆహారం కూడా అదేలా ఉండబోతున్నది. స్వదేశీ, అటవీ, సేంద్రియ, రసాయన రహిత ఆహారాన్ని నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు.
విత్తనాలను భద్రపర్చడం, ఉపయోగించడం, పంచుకోవడాన్ని ఒక ఉద్యమంలా కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. విత్తనాలను గుర్తించడంలో, దాచుకోవడంలో, పెంపొందించడంలో స్థానిక ప్రజల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, మన వృక్ష జాతులను, జంతు జాతులను కాపాడుకోవడంతోపాటు వాటికి సంబంధించిన సహజ, సాంస్కృతిక పద్ధతులను, సంప్రదాయాలను గౌరవించుకోవడం, రైతులు, ఆదివాసీలు, ఆటవీ ప్రాంత ప్రజలు, కొండ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, తదితరాలవారి జీవనోపాధులను భవిష్యత్ తరాల విత్తన హక్కులను కాపాడటం వంటి లక్ష్యాలను సాధించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతేకాకుండా.. స్థానిక ప్రజల అవసరాలు, ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర, ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిధ్య అటవీ సంరక్షణకు తోడుగా నిలువడం, స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతు, ప్రకృతి అనుకూల విధానాల కోసం కలిసికట్టుగా పనిచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశాలు. మరిన్ని వివరాల కోసం 97037 66290, 83095 96269, 96769 57000 నంబర్లలో సంప్రదించవచ్చు.