Site icon vidhaatha

Kaloji Award 2023 | జయరాజ్‌కు కాళోజీ పురస్కారం

Kaloji Award 2023 | విధాత, హైద్రాబాద్ : పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ ను ఎంపిక చేశారు. ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్ కు కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 1,01,116 నగదు రివార్డును, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరించనున్నారు.

ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని వినియోగించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవి గా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ వున్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.

Exit mobile version