Kamal Haasan: మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు తన నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎంఎన్ఎం పార్టీతో కుదిరిన ఒప్పందం మేరకు డీఎంకే కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కేటాయించింది. దీంతో ఆయన శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకుగానూ ఈనెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు నుంచి, రెండు అస్సాం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలాబలాల మేరకు డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు సీట్లలో నాలుగింటిని డీఎంకే.. మరో రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకోనుంది. డీఎంకే నుంచి ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీ విల్సన్, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్‌ఆర్ శివలింగం, మిత్రపక్షం ఎంఎన్ఎం నుంచి కమలహాసన్ లు నామినేషన్లు దాఖలు చేశారు. కమల్ రాజ్యసభకు వెళ్లడం ఇక లాంఛనమే కానుంది.
2018లో మక్కల్ నీది మయ్యం స్థాపించిన కమల్ హాసన్ 2024పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కేటాయించారు. రాజ్యసభకు ఆయన జూన్ 4న నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే తన సినిమా థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సినిమాను గురువారం కర్ణాటక మినహా మిగతా ప్రాంతాల్లో విడుదల చేశారు. అనంతరం కమల్ హాసన్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు.