Site icon vidhaatha

Delimitation: డీలిమిటేషన్ పై దక్షిణాది జంగ్ సైరన్ !

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఒత్తిడి పెంచేందుకు క్రమంగా ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తమ రాష్ట్రాలలో పార్లమెంట్ సీట్లు తగ్గిపోవడంతో పాటు సమాఖ్య విధానమే బలహీన పడుతుందని, పార్లమెంట్ పరంగా ఉత్తర భారత పెత్తనం మరింత పెరిగిపోతుందన్న ఆందోళనను దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే సీఎం స్టాలిన్ ఇప్పటికే పునర్విభజన ప్రక్రియను మరో 30 సంవత్సరాల పాటు వాయిదా వేయాలని కోరుతూ తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పార్లమెంటు వేదికగా తమ వాదనను పార్టీ ఎంపీల ద్వారా వినిపించారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు డీలిమిటేషన్ తో ఎంపీ సీట్లు తగ్గి నష్టపోతాయని, జనాభా నియంత్రణ పాటించని యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో మరిన్ని ఎంపీ సీట్లు పెరిగి లాభపడుతాయని వారు గళమెత్తారు. డీలిమిటేషన్ తో నష్టపోతున్న దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే క్రమంలో ఈ నెల 22న చైన్నైలో అఖిలపక్ష సదస్సు ఏర్పాటుకు నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలపై నిర్వహించే ఈ సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల సీఎంలను, పార్టీలను ఆయన అహ్వానిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డీలిమిటేషన్ పై స్టాలిన్ తో కలిసి పోరాడేందుకు తన అంగీకారం తెలిపారు.

తెలంగాణ పార్టీలకు ఆహ్వానం
సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న చైన్నై అఖిల పక్ష సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని డీఎంకే బృందం గురువారం ఆహ్వానించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనిమొళి బృందం కలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తాము డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అఖిల పక్ష భేటీకి హాజరవుతామని..పోరాట కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని, బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తుందంటూ ఫైర్ అయ్యారు. మరో బృందం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌కు చేరుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో, నాయకులతో భేటీ అయ్యారు. వారిని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్ పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాలను నష్టం కల్గించే డీలిమిటేషన్ నిలిపివేయాలని బీఆర్ఎస్ సైతం డిమాండ్ చేస్తున్నది. అయితే డీలిమిటేషన్ వ్యతిరేకంగా స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాలలోని ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు, పార్టీలు ఎంతమేరకు కలిసివస్తాయన్నది ఇక్కడ కీలకంగా మారింది.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్
కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన నిర్వహించనున్నారు. జనాభా గణన అనంతరం నిర్వహించాల్సిన నియోజక వర్గాల పునర్విభజన ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అన్న సూత్రం ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగ నిబంధన పేర్కొంది. లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతి సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య సమానంగా ఉండి తీరాలని ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అనే ప్రజాస్వామిక సూత్రం నిర్దేశిస్తుంది. 2021లో జనాభా గణన కొవిడ్‌ మహమ్మారి కారణంగా జరగలేదు. జనాభా ప్రాతిపదికన నియోజవర్గాల పునర్విభజన జరుగాల్సి ఉండటంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు ఎక్కువ పెరిగే అవకాశముంది. కేంద్రం గతంలో నిర్దేశించిన కుటుంబ నియంత్రణ గట్టిగా అమలు చేసి దక్షిణాది రాష్ట్రాలలో జనాభా భారీగా తగ్గడంలో ఆ మేరకు ఈ రాష్ట్రాలలో ఎంపీల స్థానాలు తగ్గనున్నాయి.

దేశ రాజకీయాలలో మరింతగా యూపీ హవా
ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలుకలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎంపీల సంఖ్య 2026డీలిమిటేషన్ తర్వాతా 143కి పెరిగే అవకాశం ఉంది. అసలే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా ఇప్పటికే యూపీలో సాధించే ఎంపీ సీట్లు కీలకంగా ఉంటున్నాయి. యూపీలో ఎంసీ సీట్ల సంఖ్య 143కి పెరిగితే దేశ విధాన పర నిర్ణయాల్లో, నిధుల వాటాలో ఆ రాష్ట్రం ఆధిపత్యం మరింత పెరుగనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎక్కువ లాభం పొందే రాష్ట్రం యూపీ అవుతుంది. యూపీతో పాటు డీలిమిటేషన్ తో బీహార్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 40 నుండి 79కి, మహారాష్ట్రలో 48 నుండి 76కి, మధ్యప్రదేశ్‌లో 29 స్థానాల 52కు, రాజస్థాన్‌లో 25 నుండి 44 స్థానాలకు పెరిగే అవకాశముందంటున్నారు. ఈ లెక్కల మేరకు డీలిమిటేషన్ తో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం భారీగా తగ్గిపోయి.. ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరింత పెరిగిపోనుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నట్టు ఇక్కడి ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండానే ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగాను, చట్టాల రూపకల్పనలోనూ, కేంద్ర నిధులలో అన్యాయం జరగడం తధ్యమన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాలలో వ్యక్తమవుతోంది.

సమాఖ్య స్ఫూర్తి ప్రశ్నార్ధకం
అంతేగాక ఉత్తర, దక్షిణాదిల మధ్య తీవ్ర అసమానతలు నెలకొని రాజ్యంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తి, దేశ సమైక్యత ప్రశ్నార్ధకం కానుందన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో డీలిమిటేషన్ తో తలెత్తే సమస్యలు దేశంలో కొత్త సవాళ్లను తెరపైకి తెచ్చేదిగా ఉన్నాయి. డీలిమిటేషన్ వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని..ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లతో కేంద్రంలో పాగా వేస్తున్న ఆ పార్టీ భవిష్యత్తులో పెరుగనున్న ఉత్తరాది ఎంపీ సీట్లతో అధికారాన్ని మరింత పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని ఆందోళనల నేపథ్యంలో డీలిమిటేషన్ ను బీజేపీయేతర పార్టీలు, దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న క్రమంలో ఈ నెల 22న చైన్నైలో జరిగే అఖిల పక్ష సమావేశం ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version