Kamal Haasan : సీనియర్ నటుడు..మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్ ను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. 2024లోక్ సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే చేసుకున్న ఒప్పందం మేరకు తమిళనాడు నుంచి ఎన్నికలు జరుగనున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానాన్ని కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీకి ఇవ్వాల్సి ఉంది. గత ఒప్పందం మేరకు డీఎంకే రాజ్యసభ అభ్యర్థిగా కమలహాసన్ ను ప్రకటించింది. జూన్ 19న దేశంలోని తమిళనాడులో 6 స్థానాలకు, అస్సాంలోని 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
తమిళనాడు నుంచి అన్బుమణి రాందాస్, ఎం.షణ్ముగం, ఎన్. చంద్రశేఖరన్, ఎం. మహమ్మద్ అబ్దుల్లా, పి.విల్సన్, వైగోల పదవి కాలం జూలై 25తో ముగిపోనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో ఆ పార్టీ 4 రాజ్యసభ స్థానాలను సునాయసంగా గెలవనుంది. మరో రెండు రాజ్యసభ స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలో చేరవచ్చు. అన్నాడీఎంకేకు ఒక స్థానం గెలుచుకునే ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నప్పటికి మరో స్థానం గెలిచేందుకు బీజేపీ, పీఎంకేల సహకారం కోరనుందని సమాచారం.