విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు అవినీతి అధికారులే నచ్చుతారేమోనని ఇందుకు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ వ్యవహారమే నిదర్శనమని కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులు, అంబేద్కర్ ముసుగులో నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గురుకులాల నిర్వహణలో చేసిన అక్రమాలు కేంద్ర ఆడిటింగ్ లో వెలుగు చూశాయని సామా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎస్సీ గురుకుల పిల్లల సంక్షేమ సొమ్ము బయట నీతులు చెప్పే కొంత మంది స్వార్థానికి లూటీ కాబడిందన్నారు. రాజ్యాంగాన్ని పాటించని వారు..కులం ముసుగులో పేద పిల్లల సంక్షేమం సొమ్ము తిన్నవారు..పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించని వారు..పిల్లల భవిష్యత్తు పేరు మీద అవినీతికి పాల్పడ్డవారు..తమ స్వార్ధ రాజకీయం కోసం దొర గడి ముందు ఏనుగును వదిలేసిన వారు అంటే కేసీఆర్ కి నచ్చుతారేమో… కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఎప్పటికీ నచ్చరు అని సామా స్పష్టం చేశారు.
గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తన హయాంలో పిల్లలకు కోడింగ్ నేర్పిస్తామని చెప్పి ఏడాదికి రూ.4.5కోట్లు కొల్లగొట్టారని సామా రాంమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కనీసం ఈ-టెండర్ ప్రక్రియను కూడా పాటించలేదని..అంబేద్కర్ పేరు చెప్పి దళిత విద్యార్థుల పేర్లపై లూటీ చేశారని రాంమోహన్ రెడ్డి ఆరోపించారు. టాపర్ లైసెన్సెస్ పేరు మీద ఐఐటీ.. జేఈఈ, నీట్ ఆన్లైన్ కోర్స్ కి 20 కోట్లు ఖర్చు పెట్టారు.. టెండర్ లేదు.. ఆర్ధిక శాఖ అనుమతి లేదని ఆరోపించారు. సమ్మర్ క్యాంప్ ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారని, యూనిఫాం..దుప్పట్ల పంపిణీలోనూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్కామ్ చేశాడని ఆరోపించారు. వీటన్నింటిని కాగ్ ఆడిట్ లో బయటపెట్టిందని సామా వెల్లడించారు. ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సామా డిమాండ్ చేశారు.