T20 CWC-2026 | టీ20 వరల్డ్‌కప్​లో భారత్‌ మ్యాచ్‌ బాయ్‌కాట్ : పాకిస్తాన్ సంచలన నిర్ణయం

టీ20 వరల్డ్‌కప్ 2026లో పాల్గొంటామని ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం, భారత్‌తో జరగాల్సిన కీలక గ్రూప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్​ను బహిష్కరిస్తున్నట్లు తెలిపిన పాక్​, కారణం మాత్రం చెప్పలేదు. ఐసీసీ తదుపరి కార్యాచరణ కోసం వేచిచూడాల్సిఉంది.

India Pakistan captains at toss during a match amid boycott controversy and ICC dispute

Pakistan Boycotts High-Voltage India Match in T20 World Cup 2026

సారాంశం

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ బాయ్‌కాట్. ఫిబ్రవరి 15 మ్యాచ్‌కు దూరం. ICC–బంగ్లాదేశ్ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. పాయింట్లు, ఆదాయంపై తీవ్ర ప్రభావం.

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

T20 CWC-2026 | టీ20 వరల్డ్‌కప్ 2026లో పాల్గొంటామని ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం… భారత్‌తో జరగాల్సిన కీలక గ్రూప్ మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జరగాల్సిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న హై–వోల్టేజ్ మ్యాచ్ లేకుండానే ఈసారి వరల్డ్‌కప్ కొనసాగనుంది.

పాకిస్థాన్​ ప్రభుత్వ ప్రకటనతో ఊహాగానాలకు తెర

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా, భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా అనే అంశాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన అధికారిక ‘X’ ఖాతాలో ప్రకటన విడుదల చేస్తూ టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నామని, అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఊహాగానాలకు తెరపడినా, ఈ నిర్ణయానికి గల అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధికారికంగా లేఖ పంపలేదు. దీంతో ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగియలేదన్న భావన నెలకొంది.

❝ టీ20 వరల్డ్‌కప్ 2026లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతి ఇస్తున్నాం.
అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనదు ❞

— పాకిస్థాన్ ప్రభుత్వం

ఈ నిర్ణయం వెనుక ఇటీవల జరిగిన ఐసీసీ–బంగ్లాదేశ్ వివాదమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా కారణాలతో భారత్‌లో ఆడలేమంటూ బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ICC తిరస్కరించడంతో వారిని టోర్నీ నుంచి తొలగించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో PCB చైర్మన్ మొహ్సిన్ నక్వీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినా, ఊహించిన దానికంటే ముందే ప్రభుత్వం తుది ప్రకటన విడుదల చేసింది.

ఇండియాకు వాకోవర్​ – పూర్తి పాయింట్లు

ఈ నిర్ణయంతో టోర్నీలో భారత్‌కు వాక్‌ఓవర్ ద్వారా పూర్తి పాయింట్లు దక్కనున్నాయి. పాకిస్తాన్‌ పాయింట్లు కోల్పోవడమే కాకుండా,  ICC విధించే జరిమానాను కూడా భరించాల్సిఉంటుంది. ముఖ్యంగా భారత్–పాకిస్తాన్ మ్యాచ్ వల్ల వచ్చే వేల కోట్ల రూపాయల ప్రసార, ప్రకటన ఆదాయంపై భారీ ప్రభావం పడే అవకాశముందని అంచనా. ఇప్పటికే జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా పాకిస్తాన్ వాయిదా వేసిన విషయం గమనార్హం.

2009 టీ20 వరల్డ్‌కప్ విజేత అయిన పాకిస్తాన్ ఈసారి గ్రూప్–Aలో బరిలోకి దిగుతోంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA జట్లు ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరగనున్నాయి. సల్మాన్ అలీ ఆగా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో, ఫిబ్రవరి 10న USAతో, ఫిబ్రవరి 15న భారత్‌తో (బాయ్‌కాట్), ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండటం వల్ల రెండు కీలక పాయింట్లు కోల్పోనుంది.

ICC నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు ఓటమిగా నమోదు అవుతుంది. పూర్తి 20 ఓవర్లు గణనలోకి తీసుకోవడంతో నెట్ రన్‌రేట్ తగ్గుతుంది. దీంతో సెమీఫైనల్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. ఒకే ఒక్క మ్యాచ్ బాయ్‌కాట్ పాకిస్తాన్ ప్రపంచకప్​ ప్రయాణాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి నెలకొంది.

సీసీ సీరియస్​ – నిర్ణయం ఎలా ఉంటుందో?

భారత్–పాకిస్తాన్ మ్యాచ్ లేకుండా టీ20 ప్రపంచకప్ జరగడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐసీసీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిఉంది. ఏదేమైనా రాజకీయాలు, భద్రతా అంశాలు మరోసారి క్రీడారంగంపై ప్రభావం చూపాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ICC తీసుకునే తదుపరి నిర్ణయాలు, PCB స్పందనపై ప్రపంచ క్రికెట్ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ వివాదం ఎటు దారితీస్తుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Latest News