U19-CWC: IND vs PAK | అండర్-19 ప్రపంచకప్: సెమీస్‌కు భారత్… టోర్నీ నుంచి పాక్​ ఔట్​

అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. త్రివేది 68 పరుగులు, స్పిన్నర్ల దూకుడుతో భారత్ సెమీస్‌కు చేరగా, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Ayush Mhatre celebrating after taking a wicket in India vs Pakistan Under 19 World Cup match

India Qualify for U-19 World Cup Semi-Finals, Pakistan Knocked Out

U19-CWC | అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ దశలో భారత యువజట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్​పై 58 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ లీడర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ నాకౌట్ దశకు దూసుకెళ్లగా, పాకిస్తాన్ టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 46.2 ఓవర్లలో194 పరుగులకే ఆలౌటైంది.

బ్యాటింగ్‌లో త్రివేది నిలకడచివర్లో దూకుడు

తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఒత్తిడికి లోనైంది. 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వైభవ్​ సూర్యవంశీ దూకుడుగా ఆడి 30 పరుగులు చేసాడు. ఈ సమయంలో వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. విహాన్ మల్హోత్రా(21)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్‌ను నిలబెట్టాడు. అనంతరం లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కనిష్క్ చౌహాన్ (35), ఆర్.ఎస్. అంబ్రిష్ (29), ఖిలాన్ పటేల్ (21)లు తలా ఓ చేయి వేయడంతో 252 పరుగుల మంచి స్కోరు సాధించగలిగింది.

చివరి నాలుగు ఓవర్లలో భారత్ 39 పరుగులు చేయడం మ్యాచ్​ను పూర్తిగా మలుపు తిప్పింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్‌ కూడా భారత్‌కు భారీగా కలిసి వచ్చింది.

స్పిన్ మాయలో చిక్కుకున్న పాక్భారత్ వ్యూహాత్మక విజయం

అనంతరం, 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలో ధైర్యంగా ఆడింది. ఉస్మాన్ ఖాన్ (66), ఫర్హాన్ యూసఫ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 29.4 ఓవర్లకు స్కోర్ 151/3గా ఉండటంతో పాక్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత భారత్ స్పిన్నర్లు రంగంలోకి దిగారు. పిచ్ నుంచి లభించిన టర్న్‌ను పూర్తిగా వినియోగించుకుని వరుసగా వికెట్లు తీశారు. కేవలం 43 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ కుప్పకూలింది.

కెప్టెన్ ఆయుష్ మాథ్రే 3 వికెట్లు, ఖిలాన్ పటేల్ మరో 3 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. చౌహాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు.

సెమీస్​లో ప్రవేశించాలంటే, లక్ష్యాన్ని 33 ఓవర్లలోనే అధిగమించాల్సిన పాక్​, ఏ దశలోనూ ఆవిధమైన ఆటతీరును ప్రదర్శించలేదు. కేవలం భారత్​పై విజయం మాత్రమే కావాల్సిందన్నట్లుగా ఆడారు. ఆఖరుకు 194 పరుగులకే కుప్పకూలి ఎటూకాకుండా పోయారు.

భారత్‌కు ధృడమైన బ్యాటింగ్, వైవిధ్యమైన బౌలింగ్​లే ఆయుధాలు

ఈ మ్యాచ్‌లో భారత్ వ్యూహాత్మకంగా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో పట్టు, బౌలింగ్‌లో వైవిధ్యం, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం భారత్‌కు విజయాన్ని అందించాయి.

గ్రూప్ లీడర్‌గా నిలిచిన భారత్ ఇప్పుడు సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మరోవైపు పాకిస్తాన్ అస్థిర ప్రదర్శనతో ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించింది. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు కనిష్క్​ చౌహాన్​(35 పరుగులు, 1 వికెట్​)ను వరించింది.

Latest News